Sharmila: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పర్యటన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమిత్ షా పర్యటనను నిరసిస్తూ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టే అర్హతలేని వ్యక్తి అని షర్మిల ఆరోపించారు. అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు నిర్వహించాలని సూచించారు.
అంబేద్కర్‌ను అవమానించడం దేశ ద్రోహంతో సమానమని వ్యాఖ్యానించిన షర్మిల, అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలాగే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షాను విమర్శించకుండా అతిథి మర్యాదలు చేయడం కూడా దేశానికి ద్రోహం చేసినట్లేనని ఆమె అభిప్రాయపడ్డారు.
దళితులు, బహుజనులు, ఆదివాసీలు, మైనారిటీ ప్రజలు అమిత్ షాపై ప్రశ్నలు సంధించి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయాలని షర్మిల అన్నారు. ఈ అంశం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా వేడి రాజేసింది.