Chandrababu: ఆంధ్రప్రదేశ్ కరువురహిత రాష్ట్రంగా మారాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం కడప జిల్లా మైదుకూరులో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.
సాంకేతికతను ఉపయోగించి నదుల అనుసంధానాన్ని పూర్తి చేయడమే తన ప్రధాన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ రైట్ కెనాల్ వరకు గోదావరి జలాలను రిజర్వాయర్ నిర్మాణం ద్వారా వెలుగొండ వరకు తరలించడమే తన ప్రణాళిక అని చెప్పారు. నల్లమల అడవి గుండా టన్నెల్ నిర్మాణం చేసి బనకచర్ల వరకు నీటిని అందిస్తామని స్పష్టం చేశారు.
తాను రాయలసీమలో పుట్టిన రాయలసీమ బిడ్డనని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కడపలోని కొప్పర్తిని పారిశ్రామిక కేంద్రంగా మార్చి ఉద్యోగ అవకాశాలను పెంచుతామని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.గండికోటను ప్రపంచంలోని ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేసి, ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చుతామని ప్రకటించారు.
తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్ అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ మూడు అక్షరాలు మాత్రమే కాకుండా, తెలుగువారి గర్వకారణమని అభివర్ణించారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. పేదల జీవితాలను మార్చడం రాజకీయాల ప్రధాన లక్ష్యమని ఆయన చూపించారని గుర్తుచేశారు.ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావడానికి ఎన్టీఆర్ ముఖ్య కారణమని చంద్రబాబు కొనియాడారు.