Sharad Pawar: హోం మంత్రి హుందాతనం నిలబెట్టుకోవాలి .

Sharad pawar: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన విమర్శలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకుల మధ్య మంచి మాటలన్నీ కరవయ్యాయని ఆయన అన్నారు. ఒకప్పుడు నాయకుల మధ్య సరైన భావవ్యక్తీకరణ ఉండేదని, కానీ ఇప్పుడు అది లోపించిందని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. హోంమంత్రి పదవికి ఎంతో హుందాతనం ఉంటుందని, ఆ హుందాతనాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అమిత్ షాకి హితవు పలికారు.

శరద్ పవార్ చెప్పారు: “గతంలో హోంమంత్రులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్, యశ్వంతరావు చవాన్, శంకర్ రావు చవాన్ వంటి వారు పనిచేశారు. మహారాష్ట్ర పొరుగునే ఉన్న గుజరాత్ నుంచి కూడా సమర్థులైన పాలకులు వచ్చారు. కానీ ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా ఇటీవల షిర్డీలో ప్రసంగించారు. ప్రసంగించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అమిత్ షా 1978 నాటి నా రాజకీయాలను ప్రస్తావించారు. 1978లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. అప్పుడే అమిత్ షా ఎక్కడున్నాడో నాకు తెలియదు. నా హయాంలో ప్రోగ్రసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేతలు ప్రమోద్ మహాజన్, వసంత్ రావు భగవత్ కూడా సహకరించేవారు. అప్పటి నాయకుల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండేది. ఇప్పటి రాజకీయ నేతల్లో అది కనిపించకపోవడం శోచనీయం.”

నిన్న అమిత్ షా షిర్డీలో మాట్లాడుతూ, శరద్ పవార్పై తీవ్ర విమర్శలు చేశారు. 1978లో వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారని, విశ్వాస ఘాతక రాజకీయాలు చేపట్టిన ఆయనకు మహారాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ద్వారా ప్రజలు వెన్నుపోటు రాజకీయాలను, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే కుటుంబ వారసత్వ రాజకీయాలను 20 అడుగుల లోతున భూస్థాపితం చేశారని అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu: నేరుగా ఇంటికి వెళ్లి.. సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *