Harish Rao:

Harish Rao: మీరు రంకెలు వేసినా అంకెలు మారవు.. కాంగ్రెస్ అప్పులు మా ఖాతాలో వేశారు..?

Harish Rao: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అప్పుల అంశంపై విడుదల చేసిన లెక్కలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న భట్టి విక్రమార్క అప్పుల విషయంలో పూర్తిగా అసత్యాలు మాట్లాడుతున్నారని, లేని అప్పులను ఉన్నట్టుగా చూపిస్తూ గోబెల్స్ ప్రచారానికి తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి, డ్యామేజ్ కంట్రోల్ కోసమే డిప్యూటీ సీఎం ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని అడ్డగోలు హామీలను ఇచ్చిందని, ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేసి అప్పులను సాకుగా చూపుతోందని హరీష్‌రావు ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అప్పుల డ్రామా ఆడుతోందన్నారు. “మీరు కోపంతో ఊగిపోయినంత మాత్రాన వాస్తవ లెక్కలు మారిపోవు. భట్టి విక్రమార్క గారు రంకెలు వేసినంత మాత్రాన అధికారిక అంకెలను మార్చలేరు” అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో చేసిన అప్పులను కూడా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖాతాలోనే వేసి చూపించడం భట్టి విక్రమార్క అపరిపక్వతకు నిదర్శనమన్నారు.

తాము అప్పుల విషయమై ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకే మాట మీద కట్టుబడి ఉన్నామని హరీష్‌రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులకు గాను రాష్ట్ర ఖజానా నుండి నేరుగా చెల్లించాల్సింది కేవలం రూ. 4.17 లక్షల కోట్లు మాత్రమేనని తేల్చిచెప్పారు. వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులను ఆయా సంస్థల ఆదాయం ద్వారా అవే తిరిగి చెల్లిస్తాయని, ఈ ప్రాథమిక విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా విడుదల చేసిన శ్వేతపత్రం (వైట్‌పేపర్) లోనే అంగీకరించిందని గుర్తుచేశారు. నాడు ప్రజలను నమ్మించడానికి అడ్డగోలుగా గ్యారంటీ కార్డులు పంచిన కాంగ్రెస్ నేతలకు.. ఇప్పుడు నిజాయితీగా వాటిని అమలు చేసే దమ్ము లేకనే ఇలాంటి తప్పుడు లెక్కలతో కాలయాపన చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *