PM Modi: రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్ర వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఇంధన రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రూ. 1.06 లక్షల కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు ఇంకా శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. పశ్చిమ రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చివేయడమే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు, గత ప్రభుత్వాల పెండింగ్ సంస్కృతికి భిన్నంగా రాత్రింబవళ్లు శ్రమించి సకాలంలో పూర్తి చేసిన నవభారత సంకల్పానికి నిదర్శనమని ప్రధాని కొనియాడారు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగానే జైపూర్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2 (రూ. 13 వేల కోట్లు), జోధ్‌పూర్‌లో రూ. 480 కోట్లతో నిర్మించిన నూతన ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనంతో పాటు దేశవ్యాప్తంగా ప్రాంతీయ వాయు మార్గాల అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు రూ. 28,840 కోట్ల కేటాయింపుతో ‘సవరించిన ఉడాన్ పథకాన్ని’ ప్రధాని మోదీ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ చమురు సంక్షోభాన్ని భారతదేశం తన చురుకైన దౌత్య వ్యూహాలతో ఎలా తిప్పికొట్టిందో వివరించారు. సంక్షోభానికి ముందు భారత్ కేవలం 25 నుండి 26 దేశాల నుంచే ఇంధనాన్ని దిగుమతి చేసుకునేదని, అయితే దౌత్య బలాన్ని ఉపయోగించి ఆ సంఖ్యను 40కి పైగా దేశాలకు విస్తరించామని వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో దేశీయ చమురు సంస్థలు రూ. 75,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూసినప్పటికీ, ఆ భారాన్ని సామాన్యులపై పడనీయకుండా కేంద్ర ప్రభుత్వమే భరించిందన్నారు. లీటర్ ఇంధనంపై ఏకంగా రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి పౌరులను కాపాడామని చెప్పారు. భారత్ విఫలమవుతుందని అంచనాలు వేస్తూ, దేశంలో వదంతులు వ్యాప్తి చేసి ప్రజలను రెచ్చగొట్టాలని చూసిన శక్తులన్నీ నేడు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయని మోదీ విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనింగ్ సామర్థ్యం గల దేశంగా భారత్ అవతరించిందని, దేశానికి స్వాభిమానం నిలవాలంటే స్వావలంబన (ఆత్మనిర్భరత) ఒక్కటే మార్గమని ప్రధాని స్పష్టం చేశారు.
