Shamshabad Airport: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్ట్)లో మంగళవారం రెండు వేర్వేరు సంఘటనలు భద్రతా సిబ్బందిని, ప్రయాణికులను కలవరపరిచాయి. అనుమానాస్పద బ్యాగ్ లో ₹12.72 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఎయిర్‌పోర్ట్‌లో అరైవల్స్ (Arrivals) ప్రాంతం దగ్గర గుర్తుతెలియని వ్వక్తి బ్యాగ్ వదిలేయడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.
బ్యాగ్‌ను గుర్తించిన సీఐఎస్ఎఫ్ (CISF) భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్ కి సమాచారం అందివ్వడంతో తక్షణమే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించింది.
తనిఖీల అనంతరం, బ్యాగ్‌లో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లేవని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో మొబైల్ ఫోన్లు మరియు సిగరెట్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి మొత్తం విలువ రూ.12.72 లక్షలుగా అధికారులు అంచనా వేశారు.
స్వాధీనం చేసుకున్న ఈ వస్తువులు అక్రమ రవాణాకు సంబంధించినవిగా అనుమానిస్తూ, ఆ బ్యాగ్ ఎవరిది? దాన్ని ఎందుకు వదిలేసి వెళ్లారు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.
ప్రయాణికుడి వద్ద లైవ్ బుల్లెట్ పట్టివేత
అదే రోజు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోవైపు ఒక ప్రయాణికుడి వద్ద లైవ్ బుల్లెట్ (Live Bullet) లభించడం కలకలం రేపింది. కొల్‌కతా నుంచి ఇండిగో (6E-6709) విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన విశాల్ అనే వ్యక్తి వద్ద ఈ లైవ్ బుల్లెట్‌ను గుర్తించారు అధికారులు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి బెంగళూరు వెళ్లేందుకు విశాల్ సిద్ధమవుతుండగా, సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతని బ్యాగును చెకింగ్ చేస్తున్న సమయంలో ఈ బుల్లెట్ దొరికింది.
ఇది కూడా చదవండి: Bigg Boss 9: రీ-ఎంట్రీ ఇచ్చిన భరణి.. రావడం రావడమే మాధురితో శ్రీజ గొడవ
ప్రయాణికుడి వద్ద లైవ్ బుల్లెట్ దొరకడం తీవ్రమైన భద్రతా లోపంగా భావించిన అధికారులు, అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. లైవ్ బుల్లెట్‌ను ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు, దాని ఉద్దేశం ఏమిటి అనే వివరాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గతం లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది
ఆగస్టు 28, 2025.. ఒక్క ప్రయాణికుడి లగేజీలో ఏకంగా 8 రౌండ్ల లైవ్ బుల్లెట్లు లభించాయి. పంజాబ్ భవానీఘర్‌కు చెందిన సుఖ్‌దీప్ సింగ్ (32) అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా అమృత్‌సర్ వెళ్లాల్సి ఉంది. అతని లగేజీ బ్యాగును భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా బుల్లెట్లు బయటపడ్డాయి. ఆయుధాలకు సంబంధించి ఎలాంటి లైసెన్స్ పత్రాలు చూపించలేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పోలీసులకు అప్పగించారు.
గమనిక: ప్రయాణికులు ఎవరైనా తమ వెంట బుల్లెట్లు లేదా ఆయుధాలకు సంబంధించిన వస్తువులను తీసుకురావాలంటే, వారికి తప్పనిసరిగా సరైన లైసెన్స్ పత్రాలు ఉండాలి. లేకపోతే, విమానాశ్రయ భద్రతా నియమాల ఉల్లంఘన కింద వారిపై కేసులు నమోదు చేస్తారు. ఈ రకమైన సంఘటనలు విమానాశ్రయ భద్రతా సిబ్బంది (CISF) అప్రమత్తతను, నిరంతర తనిఖీలను సూచిస్తాయి.

