MLA Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెరదించారు. పార్టీ మారారంటూ ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించారు. ఈ నిర్ణయంతో సదరు ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించినట్లయింది.
ఆధారాలు లేవన్న స్పీకర్
బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘ పరిశీలన అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు అధికారికంగా పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు చట్టపరమైన నిబంధనలు మరియు అందిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Cm chandrababu: 17.11 శాతం వృద్ధి లక్ష్యంతో ముందుకు అడుగులు
ఊరట లభించిన ఎమ్మెల్యేలు వీరే..
అనర్హత వేటు ముప్పు నుంచి గట్టెక్కిన వారిలో ప్రధానంగా ఐదుగురు కీలక నేతలు ఉన్నారు:
-
అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి)
-
ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్)
-
గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు)
-
తెల్లం వెంకట్రావు (భద్రాచలం)
-
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల)
రాజకీయ ప్రాధాన్యత
గత కొంతకాలంగా ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ, తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటోందని, వారిపై అనర్హత వేటు వేయాలని న్యాయపోరాటం చేస్తోంది. హైకోర్టు సైతం ఈ వ్యవహారంపై గడువు విధించిన నేపథ్యంలో స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సాంకేతికంగా వారు పార్టీ మారలేదని స్పీకర్ తేల్చడంతో, ఈ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి తమ పదవుల్లో కొనసాగేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. అయితే, స్పీకర్ నిర్ణయంపై ప్రతిపక్షాలు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

