Ranji Trophy: అంతర్జాతీయ క్రికెట్ లో వీళ్ళని సూపర్ స్టార్స్ అంటారు. వరుసగా మ్యాచుల్లో ఫెయిల్ అయినా అవకాశాలకు.. డబ్బుకు ఏమాత్రం లోటు రాదు. పైగా వాళ్ళ అభిమాన గణం అన్నిసార్లూ అడగలరేంటి.. ఫామ్ లేదు కానీ లేకపోతేనా అంటూ సమర్ధించుకుంటారు. సరే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఒత్తిడి ఉంటుంది. వాతావరణ పరిస్థితులు.. పిచ్ విషయాలు.. ఇతరత్రా చాలా సంగతులు ప్రభావం చూపిస్తాయి అనుకోవచ్చు. కానీ, దేశంలో జరిగే క్రికెట్ మ్యాచ్ ల్లో కూడా సింగిల్ డిజిట్ చేయడానికే తిప్పలు పడుతున్న ఈ స్టార్స్ ని ఏమనాలి. సొంత దేశం.. తమకంటే జూనియర్స్ తో ఆడుతున్న అనుకూల పరిస్థితి. అవతల బౌలర్లు పెద్ద అనుభవం ఉన్నవాళ్లు కాదు. అయినా.. రోహిత్ శర్మ మొదలుకుని రిషబ్ పంత్ వరకూ రంజీ మ్యాచ్ లో సింగిల్ డిజిట్ పరుగులతో పెవిలియన్ చేరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీరి పేలవమైన ఫామ్ చూస్తే జాలేస్తుంది.
Ranji Trophy: ఏమాత్రం ఖాళీ ఉన్నా.. దేశవాళీ క్రికెట్ లో ఆడాల్సిందే అని ఇటీవల బీసీసీఐ కచ్చితమైన రూల్ పాస్ చేసింది. ఒక్కసారి ఇంటర్నేషనల్ మ్యాచ్ అడగానే దేశవాళీ మ్యాచ్ లు ఆడకుండా తప్పించుకునే మన క్రికెటర్లకు ఇక ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ ల్లో ఆడడం తప్పలేదు. రంజీ మ్యాచ్ ల్లో టాప్ స్టార్ క్రికెటర్లు ఆడతారు అంటే.. మ్యాచ్ లు అదిరిపోతాయాని క్రికెట్ అభిమానులు కూడా సంబరపడ్డారు. కానీ, వారి సంబరం మొదటి రోజే అంటే జనవరి 23న ప్రారంభమైన రంజీమ్యాచ్ మొదటి రోజే నీరు కారిపోయింది. అవును.. మన స్టార్ క్రికెటర్లు మొదటి రోజు రంజీ మ్యాచ్ లలో కేవలం సింగిల్ డిజెట్స్ చేసి అవుట్ అయిపోయారు.
Ranji Trophy: రోహిత్ శర్మ జమ్మూ కాశ్మీర్ – మహారాష్ట్ర మ్యాచ్ లో మహారాష్ట్ర తరఫున ఆడుతూ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఇక జైశ్వాల్ కష్టం మీద 5 రన్స్ చేశాడు. అలాగే పంజాబ్ తరఫున కర్ణాటకపై బరిలో దిగిన గిల్ నాలుగంటే నాలుగు పరుగులు చేసి పక్కకు జరిగాడు. రిషబ్ పంత్ అయితే ఒకే ఒక్క పరుగుకే ఔట్ అయ్యి షాక్ ఇచ్చాడు. ఇక శ్రీశ్యాస్ అయ్యర్ (11), రహానే (12) గైక్వాడ్ (10) పరుగులు చేసి డబుల్ డిజిట్ చేరమనిపించారు. ఫామ్ లో లేని ఈ ఆటగాళ్లు రంజీ మ్యాచ్ లతో మళ్ళీ ట్రాక్ ఎక్కుతారని అందరూ భావించారు. కానీ, ఇక్కడ కూడా విఫలం కావడం షాకింగ్ గా మారింది. మరోవైపు రాహుల్, కోహ్లీ గాయాల కారణంగా మొదటి మ్యాచ్ లో ఆడలేదు. రెండో మ్యాచ్ లో ఈ ఇద్దరూ ఆడనున్నారు.
Ranji Trophy: త్వరలో అంటే జూన్ లో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎంపిక కావాలంటే ఇప్పుడు రంజీ మ్యాచ్ లలో వీరంతా రాణించాల్సిన అవసరం ఉంది. మరి వీరు తమ స్థాయికి తగ్గ సత్తా చూపించుకుని సెలక్ట్ అవుతారో.. సీనియర్లు కాబట్టి ఫర్వాలేదులే అని రంజీల్లో ప్రదర్శన పెద్ద లెక్కల్లోనిది కాదని సెలక్టర్లు దయతలుస్తారో వేచి చూడాల్సి ఉంది.