Sarojadevi: చలనచిత్ర పరిశ్రమలో అపార కీర్తిని సంపాదించిన ప్రముఖ నటి బీ. సరోజా దేవి (87) జూలై 14న సోమవారం ఉదయం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని మల్లేశ్వరంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
6 దశాబ్దాల సినీ ప్రయాణం
సరోజా దేవి 1938 జనవరి 7న జన్మించారు. 17 ఏళ్ల వయస్సులో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, దాదాపు 200 సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆమె నటనకు విపరీతమైన ఆదరణ లభించింది.
1955లో వచ్చిన “మహాకవి కాళిదాసు” చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఆమె, మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకుంది. తెలుగులో ఆమెకి తొలి బ్రేక్ “పాండురంగ మహత్యం” సినిమాతో వచ్చింది. ఆ తర్వాత “పెళ్లి కానుక”, “ఇంటికి దీపం ఇల్లాలే”, “శ్రీ సీతారామ కళ్యాణం”, “మంచి చెడు”, “శ్రీకృష్ణార్జున యుద్ధం” వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ గా ఎదిగారు.
అభినయ సరస్వతి – అవార్డుల వరద
సరోజాదేవికి ‘అభినయ సరస్వతి’ అనే బిరుదు లభించింది. ఆమె అసాధారణమైన నటనకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2008లో జీవిత సాఫల్య పురస్కారంను అందించింది.
ఇది కూడా చదవండి: Stunt Master Dead: స్టంట్ చేస్తుండగా ప్రమాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి
సినీ ప్రముఖుల నివాళులు
సరోజాదేవి మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం బెంగళూరులో ఆమె అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
ఇటీవల కోట శ్రీనివాసరావు మరణ వార్తతో షాక్‌లో ఉన్న సినీ పరిశ్రమ, ఇప్పుడు మరో గొప్ప నటిని కోల్పోయి తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.

