Secunderabad Bonalu 2025: ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా, సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జూలై 13 (ఆదివారం) నుండి 15 (మంగళవారం) వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు.
సీఎం పట్టువస్త్రాల సమర్పణ, రంగం కార్యక్రమం:
ఈ బోనాల జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జూలై 14, సోమవారం నాడు ‘రంగం’ (భవిష్యవాణి) కార్యక్రమం, ఆ తర్వాత అమ్మవారి ‘అంబారీ’ (ఏనుగు ఊరేగింపు) కూడా జరగనుంది. ఆషాఢ మాస ఉత్సవంలో మహిళలు మట్టికుండలో వండిన అన్నం, బెల్లం, పసుపు, కుంకుమతో అలంకరించిన ‘బోనం’ను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
భద్రతకు పెద్దపీట, ట్రాఫిక్ ఆంక్షలు:
భక్తుల రద్దీని నియంత్రించి, భద్రత కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు 2,500 మంది పోలీసులు, 70 సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు కాబట్టి, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.
Also Read: Mahesh Goud: మహేశ్‌కుమార్‌గౌడ్: కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా?
ముఖ్యమైన ట్రాఫిక్ సూచనలు (జూలై 13 ఉదయం 12 గంటల నుండి జూలై 15 ఉదయం 3 గంటల వరకు):
టొబాకో బజార్, హిల్ స్ట్రీట్ నుండి మహంకాళి ఆలయం వరకు, బాటా ఎక్స్ రోడ్ల నుండి రోచా బజార్ వరకు ఉన్న సుభాష్ రోడ్డును మూసివేస్తారు. ఔదయ్య ఎక్స్ రోడ్ నుండి మహంకాళి ఆలయం, జనరల్ బజార్ నుండి మహంకాళి ఆలయం రోడ్లు కూడా మూసివేయబడతాయి. ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట మార్గాలను నివారించాలని ప్రయాణికులకు సూచించారు.
రైల్వే ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులు చిలకలగూడ వైపు నుండి ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 గేటు ద్వారా లోపలికి ప్రవేశించాలని పోలీసులు కోరారు. దీనివల్ల గందరగోళం తగ్గి, సమయానికి స్టేషన్ చేరుకోవచ్చని సూచించారు.
భక్తులకు ఏర్పాట్లు:
జూలై 13, ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు శివసత్తులు, జోగినులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాటా జంక్షన్ నుండి మొత్తం 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనంతో వచ్చే మహిళలతో పాటు మరో ఐదుగురిని ఈ క్యూలైన్లలో అనుమతిస్తారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు.
ఆలయ పరిసరాలతో పాటు ఫలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా కొనసాగుతుంది. ఈ ఉత్సవాల సందర్భంగా జూలై 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లోని వైన్‌షాపులు మూసివేయబడతాయి. భక్తులు, ప్రయాణికులు పోలీసుల సూచనలను పాటిస్తూ, వేడుకలను భద్రతగా, విజయవంతంగా జరుపుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.