Sankranthi: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు జనం ప్రయాణంతో ఆదివారం మరింత రద్దీ పెరిగింది. ఆంధ్ర, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు గత మూడు రోజులుగా సొంతూళ్లకు వెళ్తుండటంతో భారీ ట్రాఫిక్ రద్దీ కొనసాగుతున్నది. ఒక్కరోజే పండుగ ఉండటంతో రైళ్లు, బస్సులు కిక్కిరిపోతున్నాయి. బస్టాండ్లలో జన జాతర నెలకొన్నది. శివారు ప్రాంతాలు కూడా వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్య భారీగా ఏర్పడింది.
Sankranthi: హైదరాబాద్‌లోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. జేబీఎస్, ఎంజీబీఎస్‌లో జనం రద్దీ విపరీతంగా ఉన్నది. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండు, ఎల్‌బీనగర్ చౌరస్తా, హయత్‌నగర్ బస్టాండ్ ప్రాంతాలు జనం రద్దీ, వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా విజయవాడ వైపు వాహనాలు బారులు తీరాయి. శనివారమే వాహనాలు భారీగా వెళ్లగా, రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ రహదారిలో పంతంగి, కొర్లపహాడ్ టోల్‌గేట్లలో వాహనాల బారులు తీరాయి.
Sankranthi: టీజీఎస్ ఆర్టీసీ సుమారు 6 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నా జనం రద్దీకి చాలడం లేదు. కార్లు, బైక్‌లు, జీపులు.. ఏది దొరికితే అదే పదివేలు అనుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. వాహనాల రద్దీతో ఎల్‌బీ నగర్‌లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ఆలస్యంగా వాహనాలు కదులుతున్నాయి.
Sankranthi: ఇదే అదనుగా భావించిన కొందరు ప్రయాణ చార్జీలను నాలుగింతలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రయాణికుల ఆసరాను క్యాష్ చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. సాధారణంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ ధర ఏ ప్రాంతాలకు వెళ్లినా సుమారు రూ.500 నుంచి రూ.2000 వరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.1000 నుంచి రూ.6000 వరకు వసూలు చేసి సామాన్య ప్రయాణికులపై భారం వేస్తున్నారు. వాహనాలు దొరక్క అధిక ఛార్జీలు చెల్లిస్తూ ప్రయాణాలు చేయాల్సిన దుస్థితి దాపురించింది.