Hyderabad: సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్‌లో గల్లంతైన యువకుల మృతదేహాలను ఎట్టకేలకు వెలికితీశారు. విహారం కోసం వచ్చిన హైదరాబాద్ యువకుల రాక విషాదాంతంగా ముగిసింది. ఏడుగురు యువకులు రాగా, ఈతకొడుతూ సరదాగా గడిపారు. సెల్ఫీలు దిగుతూ, కేరింతలు కొడుతూ ఆనందం పంచుకున్నారు. అంతలోనే అగాధం వారిని కబలించింది. ఈ సమయంలో వారిలో ఏడుగురూ నీటిలో గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని స్థానికులు కాపాడగా, మిగతా ఐదుగురు విగతజీవులయ్యారు.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌కు చెందిన ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), సాహిల్ (17), జతిన్ (17) సహా మరో కొమరి మృగాంక్, ఎండీ ఇబ్రహీం కలిసి సరదా కోసం కొండపోచమ్మ సాగర్‌కు బయలుదేరి వెళ్లారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మూడు స్కూటీలపై వారు ఆనందంతో వెళ్లారు. తొలుత రిజర్వాయర్ ఒడ్డున నీళ్లు చల్లుకుంటూ, సరదాగా సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ కేరింతలు కొడుతూ ఆనందం పంచుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియా గ్రూప్‌లలో పంచుకున్నారు.
Hyderabad: ఈ లోగా మరింత లోతుకు వెళ్లడంతో ఒకరి తర్వాత ఒకరుగా అగాధంలోకి వెళ్లిపోయారు. ఏడుగురూ గల్లంతవుతుండగా, గుర్తించిన స్థానికులు కొమరి మృగాంక్, ఎండీ ఇబ్రహీంని బయటకు తీసుకురావడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా ఐదుగురి ఆచూకీ దొరకలేదు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. హైదరాబాద్ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. వారంతా ప్రత్యేక బోట్ సాయంతో సుమారు 7 గంటల పాటు శ్రమించి ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు. ఐదుగురు యువకుల మృతితో వారి నివాస ప్రాంతాలు విషాదంలో మునిగిపోయాయి.