Sangareddy: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జైలులో గంజాయికి బానిసలైన ఓ ఇద్దరు ఖదీలు వీరంగం సృష్టిస్తున్నారు. గంజాయి దొరక్కపోవడంతో వారు పిచ్చి చేష్టలకు దిగుతున్నారు. వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లినా అక్కడ కూడా వారి తిక్క చేష్టలు తగ్గలేదు. వారిని కనీసం సిబ్బంది అదుపు చేయలేని పరిస్థితి నెలకొన్నది. వారిని అదుపు చేయడం చాలా కష్టమవుతుందని ఏకంగా జైలు అధికారులే చేతులెత్తేశారు.
Sangareddy: హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఆ ఇద్దరు నిందితులు గతంలో గంజాయికి బానిసలుగా మారారు. జైలుకు వచ్చిన తర్వాత పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తించసాగారు. గోడ గడియారం బ్యాటరీ, పెన్ను మూతను మింగేసి, గాజు పెంకులు తిన్నామని, కడుపులో నొప్పిగా ఉన్నదని ఆ ఇద్దరు ఖైదీలు జైలు అధికారులకు తెలిపారు.
Sangareddy: దీంతో వారిని సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి సిబ్బంది తరలించారు. అక్కడ వైద్య చేయించుకునేందుకు కూడా ఆ ఖైదీలు నిరాకరించారు. అసుపత్రి వైద్యులను, సిబ్బందిపై దుర్భషలాడటంతో వారిని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా కలకలం రేపారు. వారిని పడుకోబెట్టిన మంచాన్ని విరగ్గొట్టి, విరిగిన ముక్కలతో అద్దాలు పగులగొట్టి, దగ్గరికొస్తే గాజు పెంకులు మింగేస్తామని డాక్టర్లను, పోలీసు సిబ్బందిని ఖైదీలు బెదిరించారు.
Sangareddy: వారి మానసిక పరిస్థితి సరిగా లేదని వారిని అక్కడి నుంచి ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా, మానసిక పరిస్థితి బాగానే ఉన్నట్టు తేలింది. అక్కడి నుంచి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎక్స్‌రే తీయగా, గడియారం బ్యాటరీ, పెన్ను మూత మింగేశారని తేల్చారు. దానికి అనుగుణంగా వైద్యం చేసి డిశ్చార్జి చేశారు. గంజాయికి బానిసలుగా మారిన ఆ ఇద్దరు నిత్యం ఏదో ఒక నేరం చేస్తుంటారని, వారిని అదుపు చేయడం చాలా కష్టమవుతుందని జైలు అధికారులు తెలిపారు.