Chandrababu

Chandrababu: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ.. పు పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం!

Chandrababu: కలియుగ వైకుంఠమైన తిరుమల గిరుల్లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోలాహలం మొదలైంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వార్షిక వేడుకలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది. ఈ పవిత్ర ఉత్సవాల వేళ మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వరస్వామికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో రెండు రోజుల పాటు పలు ఆధ్యాత్మిక, ప్రజాహిత అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.

శాస్త్రోక్తంగా అంకురార్పణ – నేడు ధ్వజారోహణం..

బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచకంగా సోమవారం సాయంత్రం ఆలయ సేనాధిపతి శ్రీ విష్వక్సేనుల వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పుట్టమన్నులో నవధాన్యాలను నాటే అంకురార్పణ ఘట్టాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ పూర్తి చేశారు.
సెప్టెంబర్ 15 సాయంత్రం 5:30 నుంచి 7:00 గంటల మధ్య మీన లగ్నంలో గరుడ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరగనున్నాయి.
తిరుమలలో సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ (15-09-2026)..
  • సాయంత్రం 5:30: అమరావతి నుంచి బయలుదేరి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
  • సాయంత్రం 6:20: రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుని గాయత్రీ నిలయం అతిథి గృహంలో బస చేస్తారు.
  • రాత్రి 7:40: బేడి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని, అక్కడి నుంచి ప్రభుత్వం తరఫున తీసుకువచ్చిన పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్తారు.
  • రాత్రి 7:55 – 9:00: శ్రీవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
  • క్యాలెండర్లు, యాప్‌ల ఆవిష్కరణ: స్వామివారి దర్శనానంతరం టీటీడీ 2027 డైరీలు, క్యాలెండర్లతో పాటు భక్తుల సౌకర్యార్థం రూపొందించిన ‘నందకం యాప్’, భక్తుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను సీఎం ప్రారంభిస్తారు.
  • రాత్రి 9:00: బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి వాహనమైన పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.

రేపటి (16-09-2026) పర్యటన వివరాలు..

  • ఉదయం 8:40: వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో నూతనంగా తీర్చిదిద్దిన ‘పిల్‌గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ను ప్రారంభిస్తారు.
  • ఉదయం 9:15: గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద సరికొత్త రిలయన్స్ ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సులకు పచ్చజెండా ఊపుతారు.
  • ఉదయం 9:35 – 10:20: అత్యాధునికంగా పునర్నిర్మించిన చారిత్రాత్మక ఎస్వీ మ్యూజియంను ప్రారంభించి పరిశీలిస్తారు.
  • ఉదయం 11:30: అన్నమయ్య భవనంలో తిరుమల అభివృద్ధి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
  • మధ్యాహ్నం 2:00: తిరుమల పర్యటన ముగించుకుని తిరిగి అమరావతికి పయనమవుతారు.

భక్తుల కోసం విశేష ఏర్పాట్లు – ఫల, పుష్ప ప్రదర్శన..

బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ అన్ని విభాగాలను సమాయత్తం చేసినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు:
భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఫల, పుష్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.ఈ ఏడాది పుష్ప ప్రదర్శనశాలలో శ్రీకృష్ణ లీలల్లోని ‘శిశుపాల వధ’ ఘట్టాన్ని అత్యంత సహజంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిరంతర నిఘా, కట్టుదిట్టమైన భద్రత, అన్నప్రసాదాల వితరణకు పూర్తి ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *