Viral News: సోషల్ మీడియాలో ప్రేమలు, పరిచయాలు ఏ స్థాయి మోసాలకు దారితీస్తున్నాయో చెప్పేందుకు గుజరాత్లో వెలుగుచూసిన ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయి అనుకుని ఛాటింగ్ చేశాడు.. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు.. పెద్దలను ఒప్పించి తాళి కూడా కట్టేశాడు. తీరా పది రోజుల తర్వాత అసలు రూపం బయటపడటంతో వరుడు, అతడి కుటుంబ సభ్యుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. భార్య అనుకున్న వ్యక్తి వధువు కాదని, లేడీ గెటప్‌లో వచ్చిన అబ్బాయని తెలియడంతో పోలీసుల ముందే బిత్తరపోయారు.
ఇన్‌స్టాలో పరిచయం – పీటలెక్కిన పెళ్లి..
గుజరాత్‌కు చెందిన ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యువతి పేరుతో పరిచయం ఏర్పడింది. రోజూ మాటలు, చాటింగ్‌లు, “నువ్వు లేక నేను లేను” అనే స్థాయికి చేరిన ప్రేమ వ్యవహారం చివరకు పెళ్లి వైపు నడిపించింది. ఇరువైపులా మాట్లాడి పెద్దల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నారు. జీవితాంతం తోడుంటానని ముసుగులో ఉన్న వధువుకు తాళి కట్టాడు వరుడు.
పెళ్లి జరిగిన నాటి నుంచే ఆ కొత్త పెళ్లికూతురు ప్రవర్తనలో వింత మార్పులు కనిపించాయి. పది రోజుల పాటు ఏదో ఒక సాకు చెబుతూ భర్తను తన దగ్గరకు రానివ్వకుండా దూరం పెడుతూ వచ్చింది. సంప్రదాయం, సిగ్గు పేరుతో నిరంతరం ముఖానికి ఘూంఘట్ (ముసుగు) ధరించి ఎవరికీ ముఖం చూపించకుండా తప్పించుకు తిరిగింది. రోజుల తరబడి ఇదే తంతు కొనసాగడంతో వరుడి కుటుంబ సభ్యులకు ఏదో తేడా కొట్టింది.
రంగంలోకి పోలీసులు – ముసుగు తొలగిస్తే సీన్ రివర్స్..
ఎంత అడిగినా ముసుగు తీయకపోవడంతో పాటు ప్రవర్తనపై తీవ్ర అనుమానం రావడంతో అబ్బాయి తరఫు కుటుంబ సభ్యులు నేరుగా పోలీసులను ఆశ్రయించారు.. పోలీసుల సమక్షంలో గట్టిగా నిలదీసి, వధువు ముఖంపై ఉన్న ముసుగును తొలగించి చూశారు. ముసుగు వెనుక ఉన్నది ఏ యువతో కాదు.. అచ్చం ఆడ వేషధారణ వేసుకుని మోసానికి తెరలేపిన ఓ మగాడని తెలియడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
ఇన్స్టాగ్రామ్ మోజులో పడి నిజానిజాలు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ ఘటన కళ్లకు కట్టింది. ప్రస్తుతం ఈ షాకింగ్ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
