Ruthu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులు రైతు భరోసా సాయం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులకు రైతుబంధు పథకం పేరిట ఎకరాకు ఏటా రూ.10,000 నగదు సాయం అందజేసేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఆ పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరాకు రూ.10,000 నుంచి నగదు సాయాన్ని రూ.12,000కు పెంచింది.
Ruthu Bharosa: ఇప్పటికే ఈ వానకాలం రూ.6,000 నగదు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఈ యాసంగికి మరో రూ.6,000ను ఇవ్వాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పుడు అందజేస్తుందా? అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వానకాలం పంటల దిగుబడులు వచ్చినందున.. యాసంగికి నార్లు పోస్తున్నారు. దున్నకాలు చేపడుతున్నారు. విత్తనాలు, అడుగు మందు, యూరియా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ దశలోనే నగదు సాయం అందజేస్తే రైతులకు ఆసరా ఉంటుంది.
Ruthu Bharosa: ఇదిలా ఉండగా, ఇటీవల పంటలు చేతికొచ్చే దశలో ముంథా తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. వరి, పత్తి, మక్క, సోయా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో కనీస పెట్టుపడులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో రైతులు అప్పులు పాలై, ఆర్థికంగా చితికిపోయారు. ఈ నేథప్యంలో యాసంగి పంటల సాగుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆందోళనలో ఉన్నారు. ఈ దశలో ప్రభుత్వం రైతు భరోసా అందజేస్తే ఎంతో ఆసరా అవుతుంది.
Ruthu Bharosa: ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. నవంబర్ 25వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ కీలక భేటీ కానున్నది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నది. ఒకవేళ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి లబ్ధి పొందాలని భావిస్తే, ఈ క్యాబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకొని ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా రైతు భరోసా అందజేసే అవకాశం కూడా ఉంటుంది.
Ruthu Bharosa: ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఎన్నికల సంఘం అభ్యంతర తెలపకపోవచ్చని తెలుస్తున్నది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విడతల వారిగా పోలింగ్ జరిగే తేదీలోపు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు ముందే రైతు భరోసా కింద రూ.6,000 నగదు సాయాన్ని ప్రభుత్వం ఇస్తుందా? వచ్చే పరిషత్ ఎన్నికలకు ముందు ఇస్తుందో కొన్ని నవంబర్ 25 క్యాబినెట్ భేటీ అనంతరం తెలిసిపోతుంది.

