Putin: గతేడాది జరిగిన అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదానికి తమ వైమానిక దళమే కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ తో సమావేశంలో పాల్గొన్న పుతిన్ …. ఆ దుర్ఘటన విషాదకరమైందని తెలిపారు. తొలిసారి దీనిని అంగీకరించిన రష్యా అధ్యక్షుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఉక్రెయిన్ డ్రోన్లను నాశనం చేసేందుకు క్షిపణులను మోహరించామని అవి పౌర విమానానికి కొన్ని మీటర్ల దూరంలో పేలినట్టు పుతిన్ తెలిపారు. అయితే, పౌర విమానంపై నేరుగా క్షిపణి దాడి చేయలేదని శకలాల వల్లే విమానం దెబ్బతిందన్నారు. బాధితులకు పరిహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తామని చెప్పారు.అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం 2024 డిసెంబరు 25న రాజధాని బాకు నుంచి చెచెన్ రాజధాని గ్రోజ్నీకి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో కజకిస్థాన్ లో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో.. 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే తమ విమానం ప్రమాదానికి గురైందని ఇల్హామ్ అలియెవ్ అప్పట్లో ఆరోపించారు.
Also Read: CM Chandrababu: సీఎంగా పదిహేనేళ్ల పరుగు చంద్రబాబు అరుదైన రికార్డు