Ap Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈరోజు ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఇస్తున్న కాఫీ నాణ్యత, ఎమ్మెల్సీలకు మండలిలో ఇస్తున్న కాఫీ నాణ్యత వేర్వేరుగా ఉందంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు కూడా స్పందిస్తూ.. రెండు చోట్ల ఇచ్చే కాఫీలో తేడా ఉన్నట్టు పేర్కొనడంతో వివాదం మరింత రగిలింది.
వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్రంగా స్పందిస్తూ అసెంబ్లీలో అధికార కూటమికి బలం ఉన్నందుకే ఒక విధంగా, మండలిలో బలం తక్కువ కనుక మరో విధంగా కాఫీ, టిఫిన్లు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో కాఫీ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Asia Cup 2025: సూర్యకుమార్కు బిగ్ షాక్.. 30 శాతం జరిమానా
ప్రభుత్వం తరఫున శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇచ్చారు. “అసెంబ్లీ, మండలిలో కాఫీ, భోజనాల్లో ఎటువంటి తేడా లేదు. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే, ఇకపై పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు. అయితే ఈ సమాధానంతో వైసీపీ సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో ఆందోళన కొనసాగించారు.
వైసీపీ పట్టుబట్టి చర్చ కొనసాగించడంతో సభ స్తంభించిపోయింది. దీంతో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సభను కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది.
కాఫీ నాణ్యతపై ఇలా సభ స్తంభించడం, ప్రజా సమస్యలను పక్కనపెట్టి చిన్న విషయంపై ఆందోళనకు దిగడం విమర్శలకు దారి తీస్తోంది. విలువైన సభా సమయం వృథా అవుతోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.