Vizag: విశాఖపట్నం శాంతిపురం వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో ఒక ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఈ బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, డ్రైవర్, బస్సు సిబ్బంది అప్రమత్తత వల్ల బస్సులో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు.
బస్సు శాంతిపురం ప్రాంతానికి చేరుకున్నప్పుడు, డ్రైవర్ ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించాడు. వెంటనే అతను అప్రమత్తమై, బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. బస్సులోని సిబ్బంది సహకారంతో ప్రయాణికులందరినీ త్వరగా కిందికి దించారు. ప్రయాణికులు దిగిన కొన్ని క్షణాలకే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి బస్సును చుట్టుముట్టాయి.
ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సు పూర్తిగా కాలిపోయినప్పటికీ, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Lobo: రోడ్డు ప్రమాదం కేసు: టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష
ఈ ఘటనపై ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు స్పందించారు. డ్రైవర్, కండక్టర్ సకాలంలో స్పందించి ప్రయాణికులను సురక్షితంగా దించేశారని, అందుకే ప్రాణహాని తప్పిందని ఆయన తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా కొంత సమయం పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

