Road Accident: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏఎస్‌పేట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాణాలు బలితీసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు కూలీలు మృతిచెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటరావుపల్లి నుంచి పలువురు కూలీలు ఆటోలో పొగాకు గ్రేడింగ్ పనుల కోసం తెల్లపాడు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు ఆటోను భారీగా ఢీకొట్టింది. ఢీకొన్న దెబ్బకు ఆటో దెబ్బతిని పలువురు కింద పడిపోవడంతో ఘోరంగా గాయాలపాలయ్యారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఆసుపత్రికి తరలించిన మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం. మిగతా ఏడుగురిని స్థానిక ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ..?
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతులు నెల్లూరు జిల్లాలోని వెంకటరావుపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రహదారులపై వేగం అధికంగా ఉండటం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అంశాలు ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం విపత్తు సాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.