Rishabh Pant: భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కెప్టెన్సీ పైన లక్నో సూపర్ జెంట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా ఎంతో విశ్వాసాన్ని చూపించాడు. ఏకంగా ఐపీఎల్ దిగ్గజ కెప్టెన్లు అయిన మహేంద్రసింగ్ ధోని రోహిత్ శర్మల సరసన పంత్ భవిష్యత్తులో నిలవబోతున్నాడని, తనకు అతని మీద పూర్తి విశ్వాసం ఉందని గొయెంకా చెప్పాడు.
తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయిలో 27 కోట్లకు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెంట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐదు జట్లు రిషబ్ పంత్ కోసం పోటాపోటీగా రేసులోకి రాగా లక్నో మాత్రం పట్టు విడవకుండా చివరకు అతనిని చేజిక్కించుకుంది. ఇక అనుకున్నట్లే అధికారికంగా జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఈ ఢిల్లీ ప్లేయర్ కు అప్పగించింది.
పంత్ తో పాటు ఈ జట్టులో నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి భీకర లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా ఉన్నారు. అయితే పంత్ కు దీనికి ముందు ఐపీఎల్ లోని ఢిల్లీ జట్టుకి కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. పైగా అతని బ్రాండ్ వ్యాల్యూ కూడా చాలా ఎక్కువగా కాబట్టి కచ్చితంగా ఫ్రాంచైజీ అతనిని కెప్టెన్ గా ప్రకటిస్తుంది అని ముందు నుంచి అందరికీ తెలిసిందే.
ఇది కూడా చదవండి: IND vs ENG: ఇంగ్లాండ్ తో రేపే మొదటి టీ20… కీలక ప్లేయర్లు వీరే..!
Rishabh Pant: అయితే తాజాగా లక్నో ఫ్రాంచైజీ యాజమాని సంజీవ్ గొయెంకా మాట్లాడుతూ రిషబ్ పంత్ పైన తనకి పూర్తి భరోసా ఉందని ఇలా చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఎంతో విజయవంతమైన కెప్టెన్లు ఇద్దరే ఇద్దరు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ. వీరిద్దరూ కలిసి తమ జట్లకు 10 ఐపిఎల్ ట్రోఫీలు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. అయితే రాబోయే రోజుల్లో ఇదే వరుసలో రిషబ్ పంత్ కూడా నిలుస్తాడని గొయెంకా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
రిషబ్ పంత్ ఐపీఎల్ లో 2016 లో అరంగేట్రం చేసినప్పటి నుండి గత సంవత్సరం వరకు దిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. అతను వచ్చిన రెండు సీజన్లలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి నేరుగా టీం ఇండియా జట్టులో చోటు సంపాదించాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలో కీలక ప్లేయర్ గా మారిన పంత్ టెస్టుల్లో మాత్రం ఎవరూ ఊహించని రీతిలో రికార్డుల మీద రికార్డు ప్రదర్శనలు కనబరిచాడు. అయితే టీ20 ఫార్మేట్ లో మాత్రం పంత్ ఎంతోకాలంగా పేలవ ప్రదర్శన ఇస్తున్నాడు. అతనికి బాగా పేరు తెచ్చిన, అతని బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోయే ఫార్మాట్ లో ఇబ్బంది పడడం ప్రశ్నార్థకంగా మారింది. అందుకే దిల్లీ కూడా అతనిని వదులుకుంది. అయితే లక్నో జట్టు మాత్రం అతని బ్యాటింగ్ విన్యాసాల పట్ల, కెప్టెన్సీ సామర్థ్యం పట్ల పూర్తి నమ్మకంతో ఉంది. మరి రిషబ్ పంత్ ఈ నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే మరొక రెండు నెలలు ఆగాల్సిందే.