Rishabh Pant

Rishabh Pant: రిషభ్ పంత్ రీ-ఎంట్రీ: విరాట్ కోహ్లీ జెర్సీలో కెప్టెన్‌గా సందడి!

Rishabh Pant: గాయం కారణంగా మూడు నెలల పాటు మైదానానికి దూరమైన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ ‘ఏ’ జట్టుకు కెప్టెన్‌గా పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, పంత్ తన ఆటకన్నా ముందు వేసుకున్న జెర్సీ నంబర్ 18 కారణంగా అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

క్రికెట్ అభిమానులందరికీ తెలిసిన విషయమే, 18వ నంబర్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ జెర్సీ నంబర్ 18. ఇటీవల విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో, ఆ నంబర్‌తో పంత్ మైదానంలోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా పంత్ వాడుకలో ఉండే జెర్సీ నంబర్ 17. మరి పొరపాటున ఈ 18వ నంబర్ జెర్సీని ధరించాడా, లేక కావాలనే కోహ్లీ గౌరవార్థం ఎంచుకున్నాడా అనే సందేహాలు ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. గతంలో కూడా ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్ ‘ఏ’ జట్టు కోసం 18వ నంబర్ జెర్సీని ధరించడం జరిగింది. కాబట్టి, ఇది కేవలం ‘ఏ’ జట్టుకు తాత్కాలికంగా కేటాయించిన నంబర్ అయ్యే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: Ben Austin: ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర విషాదం: 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ మృతి

క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, వారి జెర్సీ నంబర్లకు కూడా గౌరవంగా రిటైర్మెంట్ ఇవ్వడం బీసీసీఐలో ఆనవాయితీగా ఉంది. ఉదాహరణకు, సచిన్ టెండూల్కర్ (నంబర్ 10), ఎం.ఎస్. ధోని (నంబర్ 7) ఆట నుంచి వైదొలిగిన తర్వాత, ఆ నంబర్లను వేరే ఆటగాళ్లు ఉపయోగించకుండా బీసీసీఐ నిలిపివేసింది.

విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ అయినా, ఇంకా వన్డే ఫార్మాట్‌లో ఆడుతున్నాడు. అందుకే బీసీసీఐ ఇంకా 18వ నంబర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ కోహ్లీ (18), రోహిత్ శర్మ (45) కూడా వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబితే, అప్పుడు ఆ నంబర్లకు కూడా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ అనధికారిక టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన రిషభ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ‘ఏ’ బౌలర్లను దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టు ఓపెనర్ జోర్డాన్, వన్‌డౌన్ బ్యాటర్ హమ్జా సమర్థంగా ఎదుర్కొన్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత పంత్ ఫిట్‌నెస్, కెప్టెన్సీ ఎలా ఉందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *