Chandrababu Naidu: అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన సీఎంగా నిలవగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా తేలారు.
అత్యంత ధనవంతుడు చంద్రబాబు
నివేదిక ప్రకారం చంద్రబాబు మొత్తం రూ.931 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. దీంతో ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉండగా, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు.
ఇది కూడా చదవండి: Suravaram Sudhakar Reddy: సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు
అత్యంత పేద సీఎం మమతా
ఈ జాబితాలో అట్టడుగున మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె దగ్గర మొత్తం ఆస్తులు కేవలం రూ.15.38 లక్షలు మాత్రమే ఉన్నాయి. 2021 భవానీపూర్ ఉప ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, మమతా వద్ద రూ.69,255 నగదు, రూ.13.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి. అంతేకాదు, ఆమె పేరిట ఎలాంటి భూమి లేదా ఇల్లు లేకపోవడం ప్రత్యేకత. ఆమె వద్ద ఉన్న ఏకైక ఆస్తి 9 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ.43,837 విలువ). గడచిన సంవత్సరాలుగా ఆమె ఆస్తులు తగ్గుముఖం పట్టాయని ఈ లెక్కలు చెబుతున్నాయి.
సగటు ఆస్తుల విలువ
దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులపై చేసిన ఈ విశ్లేషణలో, సగటు ఆస్తి విలువ రూ.54.42 కోట్లుగా తేలింది. మొత్తం ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.1,632 కోట్లుగా ఉందని నివేదిక వెల్లడించింది. వీరిలో ఇద్దరు ముఖ్యమంత్రులు బిలియనీర్ల కేటగిరీలోకి చేరారని కూడా తెలిపింది.
నివేదిక విశ్లేషణ
ఈ నివేదికను ముఖ్యమంత్రులు తమ నామినేషన్ల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా తయారు చేసినట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ రాష్ట్రాన్ని ఈ లెక్కల్లో చేర్చలేదని నివేదిక వెల్లడించింది.