WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. తమ స్టార్ ప్లేయర్లు అందరూ గాయాల కారణంగా టోర్నమెంట్ కు దూరం అయినా మతి చెదిరే ఆత్మవిశ్వాసంతో ఆడిన అమ్మాయిలు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఏకంగా 202 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 9 బంతులు ఉండగానే ఛేదించి రికార్డు సృష్టించారు.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ అనగా డబ్ల్యూపీఎల్ 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రిచా ఘోష్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్ గా నిలిచి ఆర్‌సీబీకి సంచలన విజయాన్ని అందించారు.
మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ అష్లే గార్డ్‌నర్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 79 నాటౌట్, బెత్ మూనీ 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసి రాణించగా, డియోండ్ర డాటిన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 25 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు తీయగా, కనిక అహుజ, జార్జియ వేర్‌హమ్, ప్రేమ రావత్ తలో ఒక వికెట్ తీసారు.
Also Read: Viral Video: సరయూ నదిలో పూజారి జలసమాధి.. వీడియో వైరల్
గుజరాత్ మొదట్లో అంత ధాటిగా ఏమీ ఆడలేదు. పవర్ ప్లేతో సహా వారు కొద్దిగా నిదానంగానే ఆడుతూ వచ్చారు. అయితే కెప్టెన్ గార్డ్‌నర్ క్రేజ్ లోకి అడుగు పెట్టినప్పటి నుండి సిక్సర్లతో అనుభవం లేని ఆర్సిబి బౌలింగ్ అటాక్ పైన రెచ్చిపోయింది. ఇక ఆమెతో జత కలిసిన డాటిన్ ఆర్సిబి బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో వారు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు భారీ స్కోరును సాధించారు.
అనంతరం ఆర్‌సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 202 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ స్మృతి మంధాన 9 పరుగులు, డానీ వ్యాట్ 4 పరుగులతో విఫలమైనా, ఎల్లిస్ పెర్రీ 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేసి, రిచా ఘోష్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 నాటౌట్ సాధించి విజయానికి కీలక పాత్ర పోషించారు. రిచా ఘోష్‌కు అండగా కనిక అహుజా 13 బంతుల్లో 4 ఫోర్లతో 30 నాటౌట్ గా నిలిచింది.
గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో అష్లే గార్డ్‌నర్ రెండు వికెట్లు తీయగా, డియాండ్ర డాటిన్, సయలి తలో ఒక వికెట్ తీసారు. లక్ష్యచేధనలో ఆర్ సి బి కి మంచి ఆరంభం లభించకపోయినా పెర్రీ మాత్రం పట్టు వదలకుండా నిలబడి తన పోరాటం కొనసాగించింది. అయితే ఆమెను అనూహ్యంగా ఫుల్ టాస్ బంతికి అవుట్ అయిన తర్వాత 109 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన ఆర్‌సీబీని రిచా ఘోష్, కనిక అహుజా ఆదుకుని, ఐదో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించి సంచలన విజయాన్ని అందించారు.