Revanth Reddy: వరంగల్ జిల్లా రాజకీయాలు, మేడారం జాతర పనుల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చేసిన ఫిర్యాదు వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ ఇష్యూపై పూర్తి నివేదికను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపారు.
ప్రభుత్వ పనుల్లో వివాదం ఎందుకు?
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పనులపై వివాదం సృష్టించడం ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మేడారం జాతరకు సంబంధించిన పనులన్నీ త్వరగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి కీలక సమయంలో అంతర్గత వివాదాలు సరికాదని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి పరోక్షంగా హెచ్చరించినట్లు సమాచారం.
ఖర్గేకు కొండా మురళి ఫిర్యాదు:
కాంగ్రెస్ నాయకత్వానికి కొండా మురళీధర్‌రావు ఫిర్యాదు చేయడంతోనే ఈ వివాదం బహిర్గతమైంది. వరంగల్ జిల్లా రాజకీయాలలో ఒక మంత్రి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని, అలాగే, మేడారం జాతర పనుల కాంట్రాక్టులను ఆయన తన సొంత కంపెనీలకు ఇచ్చుకున్నారని కొండా మురళి ఆరోపించారు. ఈ వ్యవహారాలన్నింటినీ ఆయన ఫోన్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరించారు.
సోనియా, రాహుల్‌కు సైతం నివేదన:
కేవలం ఖర్గేకే కాక, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు కూడా కొండా దంపతులు ఈ అంశాలను నివేదించినట్లు తెలుస్తోంది. “తమ జిల్లాలో, తన శాఖలో ఆ మంత్రి పెత్తనం ఏంటి?” అంటూ అధిష్ఠానానికి వారు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అయితే, కొండా మురళి ఫిర్యాదు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే హైకమాండ్‌కు పూర్తి నివేదిక పంపడంతో, ఈ అంతర్గత వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లైంది. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.