Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కూడా హస్తిన బాట పట్టనున్నారు.
సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లులను పార్లమెంటులో చర్చకు తెచ్చేలా ఎంపీలను కోరనున్నారు. అలాగే రాష్ట్రంలో కులగణన వివరాలను, వెనుకబడిన వర్గాల పరిస్థితిని ఎంపీలకు వివరించనున్నారు.
సోనియాతో భేటీ – రాహుల్, ఖర్గేతో చర్చ
సాయంత్రం సోనియాగాంధీని సీఎం రేవంత్‌రెడ్డి కలవనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోనియాను కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. రేపు రేవంత్‌రెడ్డి బృందం ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశం కానుంది. కులగణన సర్వేపై నిపుణుల కమిటీ నివేదికను వారికి అందించనున్నారు.
ఇది కూడా చదవండి: Cm Chandrababu: నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు.. నాలుగు కీలక అంశాలుపై చర్చలు
తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్?
ఇటీవల నిపుణుల కమిటీ సమర్పించిన 300 పేజీల నివేదికలో తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్ అవుతుందని అభిప్రాయపడింది. వెనుకబడిన వర్గాల పరిస్థితిని, అర్బన్-రూరల్ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలను విశ్లేషించి సూచనలు ఇచ్చింది. ఈ సర్వే కేవలం డేటా సేకరణ కాదని, “తెలంగాణ మెగా హెల్త్ చెకప్” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
30న ప్రగతి సమావేశం – పోలవరం బ్యాక్‌వాటర్‌పై చర్చ?
ఇక ఈ నెల 30న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రగతి సమావేశం జరగనుంది. ఇందులో పోలవరం బ్యాక్‌వాటర్ ముంపు సమస్యపై ప్రభావిత రాష్ట్రాలతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. అయితే గతంలో ఈ అంశం రెండు సార్లు అజెండా నుంచి తప్పించబడటంతో, ఈసారి నిజంగా చర్చకు వస్తుందా అన్నది సందేహంగా మారింది.