Kethireddy Pedda Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన తాడిపత్రిలోకి ప్రవేశించడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనను తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకుంటున్నారంటూ పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.
‘మీరు వెళ్లకుండా ఎవరు ఆపుతారు?’
పిటిషనర్ తరపు న్యాయవాదులు సిద్ధార్థ దవే, పి. సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేష్.. టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, పెద్దారెడ్డిని సొంత నియోజకవర్గంలోకి అనుమతించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, “నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు?” అని ప్రశ్నించింది. అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలని కూడా సూచించింది.
పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు
అదే సమయంలో, తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి తగిన పోలీసు సెక్యూరిటీ కల్పించాలని సుప్రీంకోర్టు ఏపీ పోలీసులను ఆదేశించింది. దీనికి సంబంధించిన ఖర్చులను భరించేందుకు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు అంగీకరించారు. ఈ తీర్పుతో పెద్దారెడ్డికి తిరిగి తాడిపత్రి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ కేసుపై తదుపరి విచారణ తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.