Ravikumar: భీమవరంలో కూటమి నేతలతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో సమాలోచనలు నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెగా డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి, అభ్యర్థులకు జాయినింగ్ లెటర్స్ అందిస్తామని చెప్పారు.
ఎన్నికలను ప్రతి ఒక్కరు అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. కూటమి ప్రభుత్వంపై విపక్ష పార్టీలు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలను ఉద్బోధించారు.
ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.