RAVI SHASTRI: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వద్దు

RAVI SHASTRI: రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, భారత్‌ క్రికెట్ జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. జట్టులో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ లేదా రిషభ్ పంత్‌కు ఈ అవకాశం ఇవ్వాలని సూచించారు.

బుమ్రాకు కెప్టెన్సీ భారం అవసరం లేదు

ఐసీసీ నిర్వహించిన ‘ది రివ్యూ’ కార్యక్రమంలో రవిశాస్త్రి మాట్లాడుతూ, జస్‌ప్రీత్ బుమ్రాకు మాత్రం కెప్టెన్సీ భారం వేయవద్దని హెచ్చరించారు. “బుమ్రా బౌలింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలి. గాయాల నుంచి కోలుకుంటున్న సమయంలో అతనిపై అదనపు ఒత్తిడిని తేవడం సరికాదు. కెప్టెన్సీ భాద్యతలు అతడి శారీరక పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశముంది,” అని శాస్త్రి చెప్పారు.

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత బుమ్రా తన తొలి ఎంపికగా ఉన్నా, ప్రస్తుతం పరిస్థితులు మారాయని, అతని సేవలను పూర్తిగా బౌలర్‌గా ఉపయోగించుకోవాలన్నారు. గతంలో వెన్ను గాయం కారణంగా బుమ్రా చాలా నెలలు జట్టుకు దూరమయ్యాడని గుర్తు చేశారు.

యువ కెప్టెన్లకు అవకాశం ఇవ్వాలి

“భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జట్టును రూపొందించాలి. శుభ్‌మన్ గిల్ మంచి ఎంపిక. అతనికి నాయకత్వ లక్షణాలున్నాయి. గంభీరత, స్థిరత అతని ప్రత్యేకతలు. అలాగే రిషభ్ పంత్ కూడా కెప్టెన్సీకి సరైన అభ్యర్థే. వీరిద్దరికీ ఐపీఎల్‌లో కెప్టెన్సీ అనుభవం ఉంది, ఇది వారికి అదనపు బలంగా నిలుస్తుంది,” అని శాస్త్రి వివరించారు.

గిల్‌పై పూర్తి విశ్వాసం

శుభ్‌మన్ గిల్‌ విదేశీ గడ్డపై పెద్దగా రాణించడం లేదన్న విమర్శలను శాస్త్రి ఖండించారు. “వాడిని ఆడనివ్వండి, తన తరఫున ఆటతోనే సమాధానం చెబుతాడు. అతను క్లాస్ ప్లేయర్‌,” అని ప్రశంసించారు. గిల్‌ ఇప్పటికే వన్డేల్లో వైస్‌ కెప్టెన్‌గా, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడని చెప్పారు. ఆ సిరీస్‌లో భారత్‌ 4–1 తేడాతో విజయం సాధించిందని, గిల్‌ 170 పరుగులు చేసి, తన సత్తా చాటాడని అన్నారు. “గిల్‌కు దేశం తరఫున ఇంకా పదేళ్ల క్రికెట్ కెరీర్ ఉంది. అతని భవిష్యత్తు బంగారు మాదిరిగా ఉంటుంది,” అని శాస్త్రి ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *