Ramachandra Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46 సార్లు ఢిల్లీకి వెళ్లినా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను మాత్రం ఎప్పుడు కావాలన్నా కలిసినట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు విమర్శించారు. సొంత పార్టీ నేత CMని పట్టించుకోకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్పు కేంద్రం బాధ్యత అనే విషయాన్ని తప్పుడు మాటగా ఖండించారు. లీగల్ ఒపీనియన్ లేకుండా ఆర్డినెన్స్ ఎలా తీసుకురాగలరు అని ఆయన ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం ఓ మోసం అని పేర్కొన్నారు. అసాధ్యమని తెలిసినా రాజకీయ లబ్ధికోసం తప్పుడు బిల్లులు తెస్తున్నారని ఆరోపించారు.
ఓటు బ్యాంకు కోసం తీసుకువచ్చిన బిల్లులను ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్ల అంశంలో బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేయడం సహించబోమని హెచ్చరించారు. ముస్లింలకు ఇవ్వబడిన 10 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి, ఆ హక్కులను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆమోదించబోదన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని వ్యాఖ్యానించారు.
తన ఢిల్లీ పర్యటన రాజకీయ పరామర్శ కోణంలోనూ ఉందని, తెలంగాణ బీజేపీ వ్యవహారాలపై పార్టీ పెద్దల దృష్టిని తీసుకోవడానికి వచ్చానని రామచందర్ రావు తెలిపారు.