Siva Re Release: నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పి, రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేసిన ట్రెండ్‌సెట్టర్ చిత్రం ‘శివ’. ఈ చిత్రం విడుదలైన దాదాపు 36 ఏళ్ల తర్వాత నవంబర్ 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పలువురు అగ్ర హీరోలు శుభాకాంక్షలు చెబుతుండగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు మరియు దానికి ఆర్జీవీ స్పందన ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.
చిరంజీవి దృష్టిలో ‘శివ’ ఒక విప్లవం
‘శివ’ రీ-రిలీజ్ సందర్భంగా చిరంజీవి ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన రామ్ గోపాల్ వర్మ విజన్, సినిమా ప్రభావాన్ని గుర్తు చేసుకుంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
“శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్… తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి, కొత్త ఒరవడికి నాంది పలికిన మూవీ అది.”
Thank you @KChiruTweets gaaru, Also on this occasion I want to sincerely apologise to you if I ever unintentionally offended you ..Thank you once again for your large heartedness 🙏🙏🙏 pic.twitter.com/08EaUPVCQT
— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2025
నాగార్జున నటనలోని తీవ్రత, శక్తి ఫెంటాస్టిక్‌గా ఉన్నాయని కొనియాడారు. “ఆ సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికీ జనాల మనసుల్లో అలాగే నిలిచిపోయింది,” అని చిరంజీవి గుర్తు చేశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ విజన్, కెమెరా యాంగిల్స్, లైట్స్, సౌండ్ ప్రజెంటేషన్… అన్నీ కొత్తగా ‘వావ్’ అనిపించాయని ప్రశంసించారు. “ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే అనుకున్నాను. హ్యాట్సాఫ్ రామ్‌గోపాల్ వర్మ,” అన్నారు. “తెలుగు సినిమా ఉన్నంతకాలం ‘శివ’ చిరంజీవిలా చిరస్మరణీయం. శివ టీమ్‌కు ఆల్ ద బెస్ట్” అని పేర్కొన్నారు.
ఆర్జీవీ భావోద్వేగ ట్వీట్: ‘బాధపెట్టి ఉంటే క్షమించండి’
చిరంజీవి ప్రశంసల వీడియోపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ మంత్రిమండలిలో మార్పులు తథ్యం! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తరువాయి తప్పదా?
చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన ఆర్జీవీ, అంతటితో ఆగకుండా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. “అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమించమని” చిరంజీవిని కోరాడు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వైరం – మళ్లీ వైరల్
వర్మ చేసిన ఈ క్షమాపణ ప్రకటన వెనుక, గతంలో చిరంజీవి-వర్మ మధ్య జరిగిన వివాదం గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఆర్జీవీ – చిరంజీవి కాంబినేషన్‌లో గతంలో ‘వినాలని వుంది’ అనే సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమా షూటింగ్ 20% వరకు పూర్తయింది.
సంజయ్ దత్ జైలు నుంచి విడుదలైన కారణంగా వర్మ, చిరు ప్రాజెక్ట్‌ను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కథలో హీరో జోక్యం చేసుకోవడం వల్లే వర్మ ఆపేశాడనే మరో ప్రచారమూ ఉంది.
అప్పటినుంచే చిరు-వర్మ మధ్య వైరం మొదలైందని సినీ వర్గాలు అంటుంటాయి. సమయం దొరికినప్పుడల్లా వర్మ… చిరంజీవిపై సెటైర్లు వేస్తుంటాడు. అలాంటిది, ఇప్పుడు సడెన్‌గా ఆర్జీవీ క్షమాపణ చెప్పడంతో నెటిజన్లు అవాక్కయ్యారు.
ఏదేమైనా, ‘శివ’ రీ-రిలీజ్ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని రెండు దిగ్గజాల మధ్య చోటు చేసుకున్న ఈ భావోద్వేగ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

