Rakul Preet Singh: పెళ్లి తర్వాత కూడా తన యాక్టింగ్ కెరీర్‌ను కొనసాగిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. చదువుకునే రోజులలోనే మోడలింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్న ఆమె, అప్పట్లో తనకు సినిమాల గురించి పెద్దగా అవగాహన లేదని చెప్పింది. దక్షిణాది చిత్రసీమ గురించి అస్సలు తెలియదని ఆమె వెల్లడించింది.
కాలేజ్‌లో చదువుకుంటూనే మోడలింగ్ చేస్తుండగా తన ఫోటోలు చూసి కన్నడ సినీ పరిశ్రమ నుంచి తొలి అవకాశం వచ్చిందని రకుల్ వివరించింది. దక్షిణాది సినిమాల గురించి ఏమీ తెలియక కొంత ఆలోచించానని, ఆ సమయంలో దర్శకులు తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడటంతో ‘గిల్లి’ సినిమాలో నటించానని చెప్పింది. తన మొదటి సినిమాతోనే యాక్టింగ్ అంటే ఎంతో ఆసక్తి కలిగిందని, అందుకే చదువు పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది.
తొలి సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ తనను సంప్రదించారని, 70 రోజుల డేట్స్ అడిగారని రకుల్ చెప్పింది. అయితే, సినిమాలపై అవగాహన లేక, అనేక అవకాశాలను వదులుకున్నానని అంగీకరించింది. తన అభిప్రాయాలు, జాకీ అభిప్రాయాలు కలిసినందునే ఇద్దరూ ఒకటయ్యామని, ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగినట్టు వెల్లడించింది.