Rajinikanth: అప్పటివరకూ సినిమా హీరో అంటే ఆరడుగులు లేకపోయినా అందగాడై ఉండాలి. భారీ పర్సనాలిటీ కనిపించాలి. డైలాగ్ డెలివరీలో నాటకీయత ఉండాలి. కానీ, ఒకరి రాకతో అవన్నీ మారిపోయాయి. అందంతో పనిలేదు.. డైలాగ్ డెలివరీలో నాటకీయత కనిపించనక్కరలేదు. ముఖ్యంగా పెద్ద పర్సనాలిటీ కనిపించాల్సిన అవసరమూ లేదని నిరూపించారు. మహామహులు ఏలుతున్న తమిళ సినిమాలో ఎక్కడి నుంచో వచ్చి.. మెల్లగా తన స్టైల్.. డిక్షన్.. తో ఇంకా చెప్పాలంటే కేవలం చిన్న చిన్న మేనరిజమ్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. తరువాత తమిళ సూపర్ స్టార్ గా అక్కడ నుంచి సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా తనదైన ప్రత్యేక ముద్రను భారత సినీ తెరపై వేశారు. ఆయనే రజనీకాంత్!
ఈరోజు అంటే 12 డిసెంబర్ కి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోగా దూసుకుపోతున్నారు… వయసు కేవలం నంబర్ మాత్రమే అంటూ హుషారుగా సాగుతున్నారు. 74 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రజనీకాంత్ కు బర్త్ డే విషెస్ చెబుతూ, ఆయన మార్క్ ను ఓసారి గుర్తు చేసుకుందాం…
ఇది కూడా చదవండి: Horoscope: నేటి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి..
Rajinikanth:రజనీకాంత్ సినిమా అంటే ఈ నాటికీ ఆబాలగోపాలం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు… అందుకు తగ్గట్టుగానే రజనీ తనదైన స్టైల్ తో మురిపిస్తూ ఉంటారు… గత కొంతకాలంగా రజనీ కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కూడా చేస్తున్నారు. గత యేడాది ‘జైలర్’తో ఘన విజయాన్ని అందుకున్న రజనీకాంత్ ఈ యేడాది ‘లాల్ సలామ్’లో అతిథి పాత్రలో మెరిసి, ‘వేట్టయాన్’తో మరో సారి అభిమానులను ఆకట్టుకున్నారు. దాంతో అభిమానులంతా ఈ వేటగాడి వాడిని చూసి ఫిదా అయిపోయారు.
తమిళనాట సూపర్ స్టార్ గా జేజేలు అందుకోకముందే తెలుగువారి అభిమానాన్నీ రజనీకాంత్ చూరగొన్నారు… పలు తెలుగు చిత్రాలలో రజనీకాంత్ చూపించిన స్టైల్ జనాన్ని కట్టిపడేసింది… వాటితో తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు రజనీ…
Rajinikanth:తమిళనాట తడాఖా చూపిస్తున్న రజనీకాంత్ సినిమాలు అనువాద రూపంలో తెలుగునాట సైతం విజయవిహారం చేశాయి… తెలుగు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయిన రజనీకాంత్ డబ్బింగ్ మూవీస్ కు కూడా ఓ స్పెషల్ క్రేజ్ నెలకొనేది… టాలీవుడ్ టాప్ స్టార్స్ స్థాయిలో రజనీ అనువాద చిత్రాలు తెలుగునాట విజయభేరీ మోగించిన సందర్భాలున్నాయి…
డిసెంబర్ 12తో రజనీకాంత్ 74 ఏళ్ళు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.ఈ వయసులోనూ అభిమానులను అలరించాలనే తపిస్తున్నారు రజనీ…. ఉత్సాహంగా ఉరకలు వేస్తోన్న రజనీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం..