BCCI President: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడి స్థానంలో గణనీయమైన మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది! ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయోపరిమితిని సమీపిస్తున్న వేళ ఆయన ఆ పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లానే రాబోయే మూడు నెలల పాటు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.
1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో గర్వించదగ్గ క్రికెటర్ రోజర్ బిన్నీ ఈ సంవత్సరం జూలై 19న తన 70వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి 70 ఏళ్ల వయోపరిమితి ఉంది. ఈ అనివార్య పరిస్థితిలో ఖాళీగా కాబోతున్న ఈ పదవిని భర్తీ చేయడానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు రాజీవ్ శుక్లా అధ్యక్షుడి విధులను నిర్వర్తిస్తారు. కాగా దీనిపై బీసీసీఐ ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ విశ్లేషకులు మాత్రం ఉపాద్యక్షుడి పదవిలో ఉన్న రాజీవ్ శుక్లానే.. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడు అంటే కన్ఫామ్ చేస్తున్నారు.
2022లో సౌరవ్ గంగూలీ నుంచి రోజర్ బిన్నీ BCCI అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ లెజెండ్ తన క్రికెట్ కెరీర్‌లో 27 టెస్టులు, 72 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, మొత్తం 124 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ కప్‌లో, బిన్నీ 8 ఇన్నింగ్స్‌లలో 18 వికెట్లు పడగొట్టి, టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రాణించాడు. ఆయన నాయకత్వంలో బీసీసీఐ అనేక మంచి నిర్ణయాలు తీసుకుంది. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. చారిత్రాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) కూడా బిన్నీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మొదలైంది.

