కొద్దిగా గ్యాప్ అంతే.. తెలంగాణలో వర్షాలు మళ్ళీ కుమ్మేస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒక్కోచోట భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబాబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులు వీస్తాయి. ఒక్కో ప్రాంతంలో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే . కొన్ని చోట్ల పిడుగులు పడొచ్చు. అందుకే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన..
సోమవారం (సెప్టెంబర్ 23) సాయంత్రం హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం అంతా వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి చల్లబడిపోయింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి పోయి, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, ముషీరాబాద్, చంపాపేట, సైదాబాద్, సరూర్ నగర్, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, మల్లాపూర్, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట, బహదూర్‌పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్ బాగ్, నాగోల్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోయినపల్లి, హిమయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీనగర్, అల్వాల్, చిలకలగూడ, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, కార్వాన్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.