Hyderabad: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఊహించని సంఘటన జరిగింది. కేవలం సెకన్ల తేడాలో ఒక యువకుడి ప్రాణాలు పోయేవి, కానీ అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పింది.
వరంగల్‌కు చెందిన సాదుల మణిదీప్ బెంగళూరు వెళ్లడానికి కాచిగూడ స్టేషన్‌కు వచ్చాడు. సాధారణ టికెట్ తీసుకున్న మణిదీప్, రైలు రాగానే తొందరలో ఏకంగా ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీ (HA1) ఎక్కేశాడు. కొద్దిసేపటికి తన పొరపాటు తెలుసుకుని కంగారు పడ్డాడు.
కదులుతున్న రైలు దిగే ప్రయత్నం.. ప్రమాదంలో యువకుడు
రైలు మెల్లగా కదలడం మొదలైంది. ఇక లాభం లేదనుకున్న మణిదీప్, కదులుతున్న రైలు దిగేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో అతని కాలు జారింది! ఇంకేముంది, రైలు కింద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా సాయం చేయకపోతే… మణిదీప్ ప్రాణాలు పోవడం ఖాయం.
అదృష్టవశాత్తు, ఆ క్షణంలోనే అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు రైల్వే సిబ్బంది – అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గోవింద రావు మరియు RPF కానిస్టేబుల్ సుస్మిత – ఈ దృశ్యాన్ని చూశారు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఉరుక్కుంటూ వెళ్లి, రైలు చక్రాల దగ్గర పడిపోతున్న మణిదీప్‌ను చాకచక్యంగా పక్కకు లాగారు. వారు చురుకుగా స్పందించడం వల్లే ఆ యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి.
Also Read: Cyclone Montha: ఏపీవైపు దూసుకొస్తున్న మోంథా తుఫాన్. . సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రైల్వే అధికారుల హెచ్చరిక: నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం!
ఈ సంఘటనపై కాచిగూడ RPF ఇన్స్పెక్టర్ స్పందించారు. కేవలం రైల్వే సిబ్బంది అప్రమత్తత వల్లే మణిదీప్ ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు.
ప్రయాణీకులకు ఆయన ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పారు:
* రైలు కదులుతున్నప్పుడు ఎక్కడం లేదా దిగడం అనేది చాలా చాలా ప్రమాదకరం! ఇలాంటి నిర్లక్ష్యపు పనులు ఎప్పుడూ చేయకూడదు.
* మీరు ఏ రైలు ఎక్కుతున్నారో, ఏ బోగీలో ప్రయాణించాలో ముందుగానే సరిగ్గా చూసుకోవాలి. టికెట్ సరిచూసుకున్న తర్వాతే రైలు ఎక్కాలి.
* ప్రమాదాలు కేవలం ఒక్క క్షణంలో జరిగిపోతాయి. కాబట్టి, రైల్వే స్టేషన్లలో మరియు రైలులో ప్రయాణించేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.
రైల్వే అధికారులు ప్రయాణికుల భద్రత కోసం తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, కొందరు ఇంకా ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడంపై RPF అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రయాణం అంటే ఆట కాదు, దయచేసి బాధ్యతగా ఉండండి!

