నేరం మరొకరు చేస్తే.. శిక్ష మహిళలకా?.. రాహుల్ గాంధీ సూటి ప్రశ్న
ఇళ్లల్లో బంధించడం పరిష్కారం కాదు..
“దేశవ్యాప్తంగా ఆడబిడ్డలు రోడ్లపై నడవాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ వేధింపులకు గురవుతామో, ఎక్కడ అత్యాచారం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. అయితే దీనికి ప్రభుత్వం చెబుతున్న పరిష్కారం ఒక్కటే.. ‘ఇళ్లల్లోనే ఉండండి’ అని. నేరం చేసిన నేరస్థులను వదిలేసి, బాధితులైన మహిళలకే ఆంక్షలు విధించడం అత్యంత దారుణం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మారాల్సింది మగవారి మైండ్‌సెట్..
మహిళలను నాలుగు గోడల మధ్య బంధించడం సమస్యకు సమాధానం కాదని.. పబ్లిక్ రోడ్లను మహిళలకు సురక్షితంగా మార్చాలని, మహిళలను వేధించే మగవారి ఆలోచనా విధానాన్ని (మైండ్‌సెట్‌ను) మార్చాలని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడేవారికి ఎటువంటి మినహాయింపులు లేకుండా తక్షణమే కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేశారు.
ఒత్తిడి తెస్తేనే వినే ప్రభుత్వం..
వేలాది మంది విద్యార్థులు మహిళల భద్రత కోసం రోడ్లపైకి వచ్చి గళమెత్తుతున్నారని రాహుల్ గుర్తు చేశారు. “మీ బాధలను వినే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు.. ప్రజా ఒత్తిడి పెరిగినప్పుడే అది దిగివస్తుంది. అందుకే శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కును ఉపయోగించుకోండి. నేను మీకు పూర్తి అండగా నిలబడతాను” అని భరోసా ఇచ్చారు.
ఆందోళనలకు దారితీసిన ఘటనలు ఇవే..
ఢిల్లీ ఆస్తా కుంజ్ పార్క్ ఘటన..
దక్షిణ ఢిల్లీలోని ప్రసిద్ధ ఆస్తా కుంజ్ పార్క్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన దేశ రాజధానిని కుదిపేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ పార్కుకు సమీపంలోనే ఉన్న ప్రతిష్ఠాత్మక ‘లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్’ (LSR) వెనుక గేటు దగ్గర ఒక నిందితుడి ఎన్‌కౌంటర్ జరగడంతో కాలేజీ కొన్ని రోజులు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించింది.
ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థుల ఉద్యమం..
ఈ ఘటన తర్వాత క్యాంపస్ పరిసరాల్లో స్ట్రీట్ లైట్లు సరిగా లేకపోవడం, సీసీటీవీల కొరత, పోలీసు పెట్రోలింగ్ లోపాలను ఎండగడుతూ ఎల్‌ఎస్‌ఆర్ సహా ఢిల్లీ వర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. సోమవారం ఆర్ట్స్ ఫ్యాకల్టీ వద్ద వందలాది మంది విద్యార్థులు, మహిళలు ఒక్కటై భారీ ప్రదర్శన నిర్వహించారు. రక్షణ పేరుతో మహిళలపై విధించే నిబంధనలను ఎత్తివేయాలని, వీధుల్లో భద్రతా మౌలిక వసతులు పెంచాలని డిమాండ్ చేశారు.
బీహార్‌లోని జముయి ఘటన..
అటు బీహార్‌లోని జముయిలోనూ పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థినులను కొందరు పోకిరీలు నడిరోడ్డుపై అడ్డుకుని వేధించడంతో పాటు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినా.. అక్కడ కూడా విద్యార్థి సంఘాలు భద్రత కోసం ఆందోళనలు చేపట్టాయి.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న వరుస నేరాలు, జవాబుదారీతనం లేకపోవడంపై సుప్రీంకోర్టు కూడా సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
గతంలో మహారాష్ట్ర బద్లాపూర్‌లో కిండర్‌గార్టెన్ చిన్నారులపై జరిగిన లైంగిక దాడి ఘటన సమయంలోనూ, సమాజంలో మార్పు రావాలని రాహుల్ గళమెత్తారు. ఇప్పుడు దేశ రాజధానిలో రగులుతున్న విద్యార్థుల ఉద్యమానికి ఆయన మద్దతు పలకడం దేశవ్యాప్తంగా మహిళా భద్రత అంశాన్ని మరోసారి జాతీయ అజెండాగా మార్చింది.