Divya Mittal: సివిల్ సర్వీసెస్‌లో నిజాయితీగల అధికారిణిగా పేరు తెచ్చుకుని, ఇటీవల తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన దివ్య మిట్టల్ తన భవిష్యత్తు కార్యాచరణపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు. ఉత్తరప్రదేశ్ వేదికగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. అయితే సాధారణ నాయకుల్లాగా ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సరికొత్త ప్రజా వేదికను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
13 ఏళ్ల సర్వీస్‌కు రాజీనామా – యూపీ నుంచే ఎందుకు?
ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్, దాదాపు 13 ఏళ్ల పాటు పలు జిల్లాల్లో కలెక్టర్‌గా, వివిధ కీలక హోదాల్లో పనిచేశారు. ఆగస్టు 30న ఆమె తన పదవికి స్వచ్ఛంద రాజీనామా చేయగా, ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఆమె తన తదుపరి అడుగును ప్రకటించారు.
యూపీ ప్రజలు నన్ను కూతురిలా చూసుకున్నారు..
ఉత్తరప్రదేశ్ కేవలం తన పని ప్రదేశం మాత్రమే కాదని, ఇక్కడి ప్రజలు తనను కుటుంబ సభ్యురాలిగా, సొంత కూతురిగా ఆదరించారని ఆమె భావోద్వేగంగా చెప్పారు. దేశ రాజకీయ గమనాన్ని నిర్దేశించే గడ్డ యూపీ అని, అందుకే ఇక్కడి నుంచే తన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నట్లు పేర్కొన్నారు.
అధికారం కోసం కాదు – గొంతుకగా మారేందుకు..
తాను ఏదో ఒక పదవి కోసమో, అధికారం కోసమో రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆఫీసుల గుమ్మం తొక్కలేని, వెళ్లినా ఎవరూ పట్టించుకోని సామాన్యుల నిస్సహాయ గొంతుకను బలంగా వినిపించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. “సమస్యల పరిష్కారానికి ఎవరైనా మెస్సయ్య (రక్షకుడు) వస్తాడని ఎదురుచూడొద్దు.. మార్పును ప్రజలే స్వయంగా మొదలుపెట్టాలి” అని పిలుపునిచ్చారు.
ఐఏఎస్‌గా పనిచేసిన నాటి చేదు అనుభవాలు. పాలనా వ్యవస్థలో నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఎలా ఉంటుందో వివరిస్తూ తన సర్వీస్ కాలం నాటి రెండు సంఘటనలను ఆమె గుర్తు చేసుకున్నారు.
మిర్జాపూర్‌లో పాఠశాల వివాదం – “వనరులు ఉన్నాయి.. చిత్తశుద్ధి లేదు”
మిర్జాపూర్‌లో తాగునీటి ప్రాజెక్టుల తనిఖీకి వెళ్లినప్పుడు ఓ సాధారణ మహిళ తన వద్దకు వచ్చిందని దివ్య మిట్టల్ చెప్పారు. ఆ మహిళ వ్యక్తిగత ఇల్లు లేదా పింఛను కోరుతుందేమో అనుకుంటే.. తమ ఊరిలో 5వ తరగతి వరకే ఉన్న పాఠశాలను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని అడిగిందని తెలిపారు. ఫైళ్లను పరిశీలిస్తే మూడేళ్ల క్రితమే అనుమతులు వచ్చినా పనులు ప్రారంభం కాలేదని తెలిసి ఆశ్చర్యపోయానని.. ఇక్కడ సమస్య నిధుల కొరత కాదని, అధికారులకు, పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమేనని తేల్చిచెప్పారు.
“పై నుంచి ఒత్తిడి”
రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నప్పుడు ఓ వ్యక్తి ప్రభుత్వ భూమి లీజు పత్రాల కోసం తిరుగుతుండగా, క్షేత్రస్థాయి నివేదికలో అవకతవకలు జరిగాయని గుర్తించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే అతనికి భూమి పొజిషన్ ఇచ్చే విషయంలో ఇతర అధికారుల వద్దకు వెళితే “పై నుంచి నిషేధం ఉంది” అని సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. అసలు ఆ ‘పై అధికారి’ ఎవరు? రాజ్యాంగం ప్రకారం ప్రజలే సర్వోన్నతులైనప్పుడు హక్కుల కోసం రికమండేషన్లు, ఫోన్ కాల్స్ ఎందుకు అవసరమని ఆమె ప్రశ్నించారు.
రోడ్ల గుంతలు, పేపర్ లీకేజీలు – ప్రశ్నించే వ్యవస్థ రావాలి..
గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని, గుంతల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని కేవలం ప్రమాదాలుగా కొట్టిపారేయలేమని, అధికారుల నిర్లక్ష్యానికి ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు.
నేటి యువత పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి చదువు ద్వారా ఎదిగిన మహిళగా యువత పడే బాధ తనకు బాగా తెలుసని.. ప్రజలు, యువత కలిసికట్టుగా ప్రశ్నిస్తూ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ముందుకు రావాలని సూచించారు.
కర్ణాటక ఐపీఎస్ అన్నామలై బాటలోనే?
దివ్య మిట్టల్ నిర్ణయం.. కర్ణాటక క్యాడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై ప్రస్థానాన్ని గుర్తు చేస్తోంది. ఆయన కూడా సివిల్ సర్వీసెస్‌ను వదిలి ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు దివ్య మిట్టల్ కూడా ఏ పార్టీ అండ లేకుండా, ప్రజలతో కలిసి ప్రజా సమస్యల ఆధారంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
