Bigg Boss 10

Bigg Boss 10: అందరి టార్గెట్ త్రిగుణే.. రోహిత్‌తో ఉమ్ము వివాదం.. అమన్‌కు నరేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

Bigg Boss 10: బిగ్ బాస్ 10వ సీజన్ సరికొత్త ట్విస్టులు, భావోద్వేగాలు, రసవత్తరమైన టాస్కులతో రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే మూడు వారాల ప్రయాణం విజయవంతంగా ముగియగా.. నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో తీవ్ర దుమారాన్ని రేపింది. ముఖ్యంగా ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎక్కువమంది కంటెస్టెంట్లు నటుడు త్రిగుణ్‌ను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. 23వ రోజుకు సంబంధించిన తొలి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. హౌస్‌మేట్స్ మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రోమోలో రగిలిన రచ్చ – త్రిగుణ్‌పై అమన్, రోహిత్ ఫైర్..

నామినేషన్లలో భాగంగా అమన్ మాట్లాడుతూ త్రిగుణ్‌ను నామినేట్ చేశాడు. “నువ్వు నాతో మాట్లాడేటప్పుడు ‘అరె తురె’ అంటూ గౌరవం లేకుండా చాలాసార్లు సంబోధించావు” అని తన కారణాన్ని చెప్పాడు. దీనికి త్రిగుణ్ ఏమాత్రం తగ్గకుండా.. “నువ్వు అలా పిలవొద్దని చెప్పిన తర్వాత మళ్లీ నేనెప్పుడైనా నిన్ను అలా పిలిచానా?” అని ఎదురుదాడి చేశాడు. “అంత వీడియో ఇచ్చినవాడివి.. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ నీకు లేదా?” అని అమన్ నిలదీయగా.. “లేదు, నాకు లేదు” అని త్రిగుణ్ ముఖం మీదే తేల్చిచెప్పాడు.
రోహిత్ సంచలన ఆరోపణ – ఉమ్ము వివాదం..
మరో కంటెస్టెంట్ రోహిత్ కూడా త్రిగుణ్‌నే నామినేట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశాడు. “హౌస్‌లో నేనేదో తప్పుడు నరేటివ్ సెట్ చేస్తున్నానని అంటున్నారు.. కానీ నా క్యారెక్టర్‌ను బ్యాడ్ చేయడానికి మీరే ప్రయత్నిస్తున్నారు. నాపై మీ ఉమ్ము పడింది.. అది కావాలనే ఉద్దేశపూర్వకంగా వేశారా లేక పొరపాటున పడిందా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను” అంటూ నిలదీశాడు. దీనిపై త్రిగుణ్ స్పందిస్తూ.. “లాంజ్‌లో లేదా వెనకాల కూర్చొని గుసగుసలాడే బ్యాచ్ నాది కాదు.. ఏదైనా ఉంటే ముఖం ముందే స్ట్రైట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తాను” అని గట్టిగా బదులిచ్చాడు.
అమన్‌ను కడిగిపారేసిన నరేష్..

నామినేషన్లలో అమన్‌ను టార్గెట్ చేస్తూ నరేష్ రంగంలోకి దిగాడు. “టాస్కులో నువ్వు సంచాలక్‌గా సరైన న్యాయం చేయలేదని నాకు అనిపించింది” అంటూ అమన్‌ను నరేష్ నామినేట్ చేశాడు. దీనికి అమన్ సమర్థించుకుంటూ.. “అక్కడ నేను వంద పనులు చేయొచ్చు భయ్యా.. కానీ నేను ఏ నిర్ణయం ఇచ్చానన్నది ముఖ్యం” అని బదులిచ్చాడు. వెంటనే నరేష్ గట్టి కౌంటర్ ఇస్తూ.. “ఈ ఇంట్లో పది గొడవలు జరిగితే అందులో కనీసం నాలుగు నీవే ఉంటాయి. ‘నీ మొహం చూస్తేనే చిరాకేస్తోంది.. నిన్ను చూస్తే విరక్తి పుడుతోంది’ అంటే ఇక్కడ ఉన్నవాళ్లెవరూ చేతులు కట్టుకుని కూర్చోరు” అంటూ అమన్ దూకుడు ప్రవర్తనను ఎండగట్టాడు. మొత్తానికి 4వ వారం నామినేషన్ ప్రక్రియ ఇంట్లోని అసలైన బంధాలు, గ్రూపుల విభేదాలను బట్టబయలు చేస్తూ తారాస్థాయికి చేరింది. మరి ఈ వారం నామినేషన్లలో చివరకు ఎవరెవరు డేంజర్ జోన్‌లోకి వెళ్తారనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *