Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 నాటి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, కుటుంబ సభ్యుల హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులు బిపించంద్ కనయ్యలాల్ జోషి, ప్రదీప్ రమణ్లాల్ మోధియాలకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే వీరు 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో, వీరి జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు నేపథ్యం – 2024లో 11 మందిని మళ్లీ జైలుకు పంపిన సుప్రీంకోర్టు!
2002 గుజరాత్ అల్లర్ల నాటి ఘటన: 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పట్లో గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరగడమే కాకుండా, ఆమె మూడేళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు.
2022 రిమిషన్ & 2024లో రద్దు: ఈ కేసులో దోషులుగా తేలిన 11 మందికి 2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం ముందస్తు విడుదల (Remission) కల్పించడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, 2024 జనవరిలో గుజరాత్ ప్రభుత్వానికి శిక్ష తగ్గించే అధికారం లేదని తేల్చిచెప్పి ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. సుప్రీం ఆదేశాలతో వారంతా తిరిగి జైలుకు వెళ్లగా, ఇప్పుడు అందులో ఇద్దరికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
