Rahul gandhi: బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ NSUI నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, బీహార్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. “యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు” అని ప్రశ్నిస్తూ, బీహార్ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు పారిపోవద్దని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు ఇక నమ్మరు” అని చెప్పారు. “ప్రజలు మోసపోరు” అని పేర్కొన్నారు. ఆయన, బీహార్ యువత తమ భవిష్యత్తును తమ చేతుల్లో రాసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీహార్‌లోని యువత పెద్దఎత్తున ‘వైట్ టీ-షర్ట్’ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లడం ఆపాలని, అందరూ కలిసి రాష్ట్రంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, పేపర్ లీక్‌ల వంటి సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. “రాహుల్ గాంధీ ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ ఓడను ముంచే ప్రయత్నం చేస్తూనే ఉంటారని, బీహార్‌లో కూడా అదే పని చేయడానికి వచ్చారని” ఎద్దేవా చేసింది.
కాగా, ఈ ఏడాది చివరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఇటీవల 40 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. రాష్ట్రంలో గెలుపొందాలని కాంగ్రెస్ నేతలు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు, ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి ఎలా రావాలనేదానిపై వ్యూహాలు రచిస్తుంది.