Rahul Gandhi: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాము కోపం, భయం, ద్వేషం వంటి భావోద్వేగాల్లో తమ ప్రత్యర్థులతో పోటీ చేయలేమని అన్నారు. “ఈ అంశాల్లో వారు మాకు మించినవారే. కోపం, ద్వేషం విషయాల్లో వారు మమ్మల్ని మళ్లీ మళ్లీ ఓడిస్తారు,” అని రాహుల్ స్పష్టంగా తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ప్రతిపక్షాన్ని అణచివేయడానికి దూకుడు రాజకీయాలు సాగుతున్నాయని విమర్శించారు. కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయిందని, అన్ని మార్గాలు మూసుకుపోయిన పరిస్థితి ఎదురైందని వివరించారు. మీడియా సహా అనేక వ్యవస్థలు తమకు అనుకూలంగా లేకపోయాయని చెప్పారు.
ఈ సంక్షోభ సమయంలో తమ చరిత్రను గుర్తు చేసుకుని, కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ తెలిపారు. తన పాదయాత్రను కశ్మీర్‌లో ముగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ యాత్ర ద్వారా ముఖ్యంగా రెండు విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు.
సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, నిన్ననే సమావేశానికి హాజరుకావలసి ఉన్నా, కశ్మీర్ పర్యటన కారణంగా ఆలస్యమైందని, అందుకు క్షమాపణలు తెలిపారు.
“ఇలాంటి పరిస్థితుల్లో, మనం ఎక్కడ, ఎలా పని చేయాలి, మన శక్తులను ఎటు దించాలి అన్న విషయంపై మేం తీవ్రంగా ఆలోచించాం. మేము మళ్లీ మా బలాన్ని నిర్మించుకునే మార్గాన్ని అన్వేషిస్తున్నాం,” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.