Radhika: బాలీవుడ్ లో చేదు అనుభవాలు.. షాకింగ్ కామెంట్స్ చేసిన లెజెండ్ హీరోయిన్

Radhika: ఎటువంటి అంశంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడే నటి రాధికా ఆప్టే సినీ పరిశ్రమలో తన 20 ఏళ్ల ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో డబ్బు కోసమే కొన్ని సినిమాలు చేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని ఆమె వెల్లడించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధికా మాట్లాడుతూ, ఒక దశలో ఆర్థిక పరిస్థితుల కారణంగా సౌత్ సినిమాల్లో నటించాల్సి వచ్చిందని చెప్పారు. ఆ షూటింగ్ సెట్స్‌లో తాను ఎన్నో అసౌకర్యకర పరిస్థితులను ఎదుర్కొన్నానని తెలిపారు.

“మొత్తం సెట్‌లో నేనొక్కదాన్నే మహిళ”

“కొన్ని షూటింగ్‌ల్లో మొత్తం సెట్‌లో నేనొక్కదాన్నే మహిళగా ఉండేదాన్ని. మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరిగేది. నా సిబ్బందిని కూడా సెట్స్‌లోకి అనుమతించేవారు కాదు. మహిళల గురించి అసభ్యకరమైన జోకులు వేస్తూ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు” అని రాధికా ఆప్టే వెల్లడించారు.

సాధారణంగా తాను ధైర్యంగా ఉంటానని చెప్పిన ఆమె, ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందని అన్నారు. “ఇప్పటికీ ఆ అనుభవాలు గుర్తుకొస్తే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏ నటికీ అలాంటి పరిస్థితి రాకూడదు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాలీవుడ్‌లోనూ చేదు అనుభవాలు

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో కూడా తనకు కొన్ని షాకింగ్ అనుభవాలు ఎదురయ్యాయని రాధికా తెలిపారు. “కొన్ని ఆఫర్ల కోసం కొందరిని కలిశాను. వాళ్లతో మాట్లాడిన తర్వాత మళ్లీ జీవితంలో కలవకూడదని నిర్ణయించుకున్నాను. వాళ్లు ఇండస్ట్రీలో చాలా పేరున్న వ్యక్తులు. వాళ్ల పేర్లు చెబితే అందరూ ఆశ్చర్యపోతారు” అని వ్యాఖ్యానించారు.

నటనా ప్రయాణం

2005లో హిందీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రాధికా ఆప్టే, ఆ తర్వాత హిందీతో పాటు తమిళం, మరాఠీ, మలయాళ చిత్రాల్లో నటించారు. 2010లో విడుదలైన ‘రక్త చరిత్ర’ సినిమాతో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *