Telangana: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం తీవ్ర రాజకీయ, ప్రజా ఆందోళనకు దారి తీసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ, ఈ నెల 14వ తేదీ (మంగళవారం) తెలంగాణ వ్యాప్తంగా బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి.
బీసీ సంఘాల ఐక్య వేదిక, ముఖ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఈ బంద్కు పిలుపునిచ్చారు. హైకోర్టు తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలోని బీసీ వర్గాల రాజకీయ హక్కులకు, ఆత్మగౌరవానికి భంగం కలిగిందని బీసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Andhra King Taluka Teaser: నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకి తెలియదు…!
ఆందోళనకు ప్రధాన కారణం:
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించడం పట్ల బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం’ అని వారు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల బీసీలకు స్థానిక సంస్థల్లో దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతింటుందని వారు ఆందోళన చెందుతున్నారు.