Pulasa: గోదావరి నదికి వరదలు రావడంతో యానాంలో పులసల సందడి మొదలైంది. వరద నీటితో వచ్చిన పులస చేపలకు భారీ డిమాండ్ నెలకొంది. మంగళవారం జరిగిన తాజా వేలంలో 2 కిలోల పులస చేప రూ.26 వేలకు అమ్ముడవడం రికార్డుగా నిలిచింది. ఈ చేపను ఆత్రేయపురం మండలం, పేరవరం గ్రామానికి చెందిన బెజవాడ సతీష్ కొనుగోలు చేశారు.
పులసలపై క్రేజ్ ఎందుకు?
గోదావరి జిల్లాలో “పుస్తెలమ్మైనా పులస తినాలి” అని చెప్పేంతగా ఈ చేపకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సముద్రం నుంచి సంతానోత్పత్తి కోసం గోదావరిలోకి వచ్చే ఈ చేపలు, ఎర్ర నీటిలో ఎదురీదుతూ వస్తాయి. అందుకే వీటి మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. గోదావరి ఎర్ర నీరు, ఔషధ గుణాలు, పులస ప్రత్యేక రుచి కలిసి ఈ చేపకు పెద్ద డిమాండ్ తెచ్చిపెడతాయి.
వేలంలో ధరలు పెరుగుతున్న విధానం
ఈ సీజన్‌లో తొలి పులస రూ.4 వేలకే అమ్ముడైనప్పటికీ అది పులస కాదు విలస అని అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత:
-
మరో చేప రూ.15 వేలకే పోయింది
-
రెండు పులసలు రూ.13 వేల, రూ.18 వేల ధర పలికాయి
-
ఈ వారంలోనే మరో చేప రూ.22 వేలకే అమ్ముడైంది
-
తాజాగా 2 కిలోల పులస రూ.26 వేలకే అమ్ముడై రికార్డు సృష్టించింది
ఇది కూడా చదవండి: Vice President Post: ఖాళీ అయినా ఉపరాష్ట్రపతి పోస్ట్.. రేసులో ముగ్గురు..
మత్స్యకారుల పంట పండుతోంది
నైరుతి ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో గోదావరికి వరదలు పెరిగాయి. ఎర్ర నీరు నదిలోకి రావడంతో పులసలు ఎక్కువగా చిక్కుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. రాబోయే రెండు నెలల్లోనూ పులసలు విరివిగా దొరకొచ్చని వారు ఆశిస్తున్నారు.
పులస లభ్యత తగ్గుతున్నది
గతంలో గోదావరి జిల్లాలో ఏటా సగటున 3 టన్నుల పులసలు దొరికేవి. కానీ ఇప్పుడు అది కేవలం రెండు మూడు క్వింటాళ్లకు పడిపోయిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ సీజన్‌లో పులసల కోసం ప్రజలు ఎంత ధరైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉంటున్నారు.

