PSR Anjaneyulu: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ నిఘా విభాగం అధిపతి పీఎస్సార్ ఆంజనేయులు (PSR Anjaneyulu) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన్ను వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది.
ఏపీపీఎస్సీ పరీక్ష మూల్యాంకనంలో అవకతవకల కేసులో అరెస్టయిన పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిరాశ ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు కూడా ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఒకవేళ అనారోగ్య సమస్యలుంటే దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని, రెండు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందే విధంగా అనుమతి పొందవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: No Credibility Serve: ఈ ప్రయోజనం లేని సర్వేల అసలు ఉద్దేశం ఏమిటి?
PSR Anjaneyulu: హైకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత పీఎస్సార్ ఆంజనేయులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. దీనికి తోడు ఆయనకు ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో జైలులో ఒక్కసారిగా ఆయనకు హై బీపీ వచ్చి, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు వెంటనే అప్రమత్తమై స్థానిక వైద్యులకు చూపించారు. వారి సిఫార్సు మేరకు తక్షణమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గుండె సంబంధిత వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తూ, చికిత్స అందిస్తున్నారు.