Karnataka: అతనో పెద్ద మనిషి. బడా బడా వ్యాపారాలే చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మిస్సింగ్. కనీసం ఆచూకీ కూడా లేదు. ఏమయ్యాడో..ఎవరన్నా కిడ్నాప్ చేశారో తెలియదు. కారు మాత్రం కనిపించింది. అది కూడా నుజ్జు నుజ్జు ఐన స్టేజిలో. మరి కారులోని మనిషి ఎక్కడ ? .ఎవరన్నా ఏదైనా చేసి…ప్రమాదంలో చనిపోయాడు అనేలా స్కెచ్ వేసారా అనే అనుమానాలు లేకపోలేదు. పోలీసులు మాత్రం ఏ క్లూ లేక …సెకండ్ యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎంత వేడితికినా …అన్ని అనుమానాలే తప్ప ..పక్కా ఆధారాలు మాత్రం దొరకడం లేదు.
కర్ణాటకకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనూహ్యంగా అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. కనిపించకుండా పోయిన వ్యాపారిని బీఎం ముంతాజ్ అలీగా గుర్తించారు. సదరు వ్యక్తి మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడు కావడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ముంతాజ్ అలీ ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు తన ఇంటి నుంచి కారులో బయలుదేరి 5 గంటల ప్రాంతంలో కులూరు వంతెన దగ్గర ఆగాడు. అనంతరం అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. కొంత సమయం తర్వాత అతని కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ముంతాజ్ అలీ డ్రైవింగ్ చేసుకుని వచ్చిన కారు కులూరు వంతెన సమీపంలో నుజ్జునజ్జైన స్థితిలో కనిపించింది.
అయితే అక్కడ ముంతాజ్ అలీ ఆనవాళ్లు కనిపించలేదు. బ్రిడ్జ్ వద్ద కారు శిథిలమై కనిపించడంతో అతను బ్రిడ్జిపై నుంచి దూకి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు ముంతాజ్ అలీ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.దీనిపై సమాచారం అందుకున్న మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం అనుసమ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ కులూరు వంతెన సమీపంలో వ్యాపారవేత్తకు చెందిన కారు ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. బీఎండబ్ల్యూ వాహనం బ్రిడ్జి వద్ద కనిపించడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ముంతాజ్ అలీ దానిని అక్కడే వదిలేసి పక్కనే ఉన్న నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సందేహిస్తున్నామన్నారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు..