Elections 2024: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించడంతో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీని పోటీలో నిలబెట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది. వయనాడ్ అభ్యర్థిగా ప్రియాంక పేరును ప్రకటించింది. దీంతో తొలిసారి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబడనున్నారు. కాగా, గత పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీ గెలిచిన సంగతి తెలిసిందే. వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలి నుంచి ఎంపీగా పోటీ చేసిన రాహుల్ గాంధీ ..రెండు చోట్లా విజయం సాధించారు. దీంతో వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాగా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే దశలో, ఝార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20 (బుధవారం)న పోలింగ్ జరగనుండగా.. ఝార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అలాగే, రెండు లోక్‌సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు వేర్వేరు రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న, నాందేడ్ లోక్‌సభ సీటుతో పాటు ఉత్తరాఖండ్‌లోని ఒక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 20న పోలింగ్ నిర్వహించి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.