Droupadi Murmu: తెలంగాణ సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబిస్తూ, ప్రజల మధ్య సోదరభావాన్ని, ఐక్యతను పెంచేందుకు నిర్వహించే ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నేడు (శుక్రవారం) హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరగనుంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ ఉత్సవం ఉదయం 11 గంటలకు మొదలవుతుంది.
రాష్ట్రపతి ప్రత్యేక సందేశం
ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ప్రజలకు ప్రత్యేక సందేశం పంపారు. అలయ్ బలయ్ పండుగను ఉత్సాహంగా నిర్వహించనున్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆచారాలను తిరిగి తీసుకురావడానికి దత్తాత్రేయ గారు ఈ పండుగను ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు.
అలయ్ బలయ్ అనేది సోదరభావాన్ని పెంపొందించే ఒక వార్షిక సాంస్కృతిక ఉత్సవం. ఇది అన్నివర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలంగాణ గొప్ప సంస్కృతిని ప్రదర్శిస్తుంది. ప్రజల్లో ఐక్యత, సామాజిక విలువలను వ్యాప్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. వేడుకలు ఘనంగా జరగాలని ఆమె ఆకాంక్షించారు.
Also Read: AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ: ప్రధాని పర్యటన, కీలక అంశాలపై చర్చ!
20వ సంవత్సర ఉత్సవం
ప్రతి ఏటా దసరా (నవరాత్రి) సమయంలో, రాజకీయాలకు అతీతంగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జరుగుతున్నది 20వ వార్షికోత్సవం కావడం విశేషం. ఈ ఉత్సవం ద్వారా తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడంతో పాటు, జాతీయ వీరులకు గౌరవం అందిస్తారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. ఈ సాంస్కృతిక సమ్మేళనం ప్రజల్లో ఐక్యతను, సామాజిక విలువలను బలంగా నిలబెట్టే వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.