Bihar Elections: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ‘జన్ సూరాజ్’ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) బీహార్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదని, తన దృష్టి సంస్థాగత పనుల మీదే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
గతంలో, పీకే తన స్వస్థలమైన కార్గాహర్ లేదా ఆర్జేడీ కంచుకోట అయిన రాఘోపూర్ నుంచి పోటీ చేయవచ్చని ఊహాగానాలు వచ్చాయి. అయితే, తాజాగా విడుదలైన ‘జన్ సూరాజ్’ అభ్యర్థుల రెండో జాబితాలో కూడా ఆయన పేరు లేకపోవడంతో, ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేయడం మరియు అభ్యర్థుల విజయం కోసం కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: Delhi Pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్.. బయటకు రావాలంటే భయం.. AQI 201 వద్ద వాయు కాలుష్యం
రాజకీయ నిర్ణయంతో పాటు, పీకే బీహార్ ఎన్నికల ఫలితాలపై జోస్యం కూడా చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమికి ఘోర పరాభవం తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జేడీయూ (JDU)కి ఎలాంటి ఓటమి దక్కబోతుందో చెప్పడానికి సెఫాలజిస్ట్ (ఎన్నికల విశ్లేషకుడు) అయి ఉండాల్సిన అవసరం లేదని, తమ పార్టీ లక్ష్యం 150 సీట్లలో ఒక్క సీటు తగ్గినా ఓడిపోయినట్లేనని ఆయన అన్నారు. పీకే నిర్ణయం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.